|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 09:27 PM
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ప్రభుత్వ స్థలాలను.. ముఖ్యంగా పార్కు స్థలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైడ్రా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఎన్నిసార్లు హెచ్చరించినా.. కొంతమంది కబ్జాదారులు వాటిని పెడచెవిన పెడుతూ.. పెద్దపెద్ద కట్టడాలను నిర్మించడం లేదా అమాయకులకు తప్పుడు పత్రాలు సృష్టించి విక్రయించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
కొర్రెములలో కబ్జాపై హైడ్రా ఉక్కుపాదం..
తాజాగా.. ఎల్బీనగర్ జోన్ పోచారం సర్కిల్ పరిధిలోని కొర్రెముల గ్రామంలో జరిగిన ఒక ఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. కొర్రెములలోని సర్వే నంబర్ 747, 750లలో ఉన్న సుమారు 1034 గజాల విస్తీర్ణంలో ఉన్న పార్కు స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించి ప్రహరీ గోడను నిర్మించారు. గతంలో కూడా హైడ్రా అధికారులు ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. అయినప్పటికీ.. కబ్జాదారులు మళ్లీ ధైర్యం చేసి అదే స్థలంలో పునర్నిర్మాణాలు చేపట్టారు. దీంతో విసిగిపోయిన స్థానికులు మరోసారి అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. సోమవారం నాడు హైడ్రా అధికారులు బందోబస్తుతో వెళ్లి ఆ ప్రహరీ గోడను పూర్తిగా కూల్చివేశారు.
ప్రభుత్వ స్థలాల్లో కబ్జాదారులు కాకుండా.. ప్రజల కోసం పౌర సౌకర్యాలు ఆట స్థలాలు, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు వంటివి అభివృద్ధి చేయడం.. నగర విస్తరణకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ అమలు చేయడం, భవిష్యత్తులో రహదారులు, రవాణా వ్యవస్థల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం కూడా దీనిలో భాగంగా ఉన్నాయి.
లేఅవుట్లలో పార్కు స్థలాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేతలే కాకుండా.. కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైడ్రా అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఎవరైనా ఇంటిని లేదా ప్లాటును కొనుగోలు చేసేటప్పుడు.. దాని పక్కన ఉన్న స్థలం నిజంగా పార్కు స్థలమా, ప్రభుత్వ భూమా అనేది ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే.. కబ్జాదారుల తప్పుడు పత్రాల బారిన పడి భారీగా నష్టపోవాల్సి వస్తుంది.