|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 08:10 PM
తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి “విజన్ డాక్యుమెంట్–2047” ఒక దిక్సూచి, భవిష్యత్‌కు దారిచూపే పథకరచన అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.విస్తృతమైన చర్చలు, నిపుణుల సూచనలు, వివిధ రంగాల అభిప్రాయాల ఆధారంగా ఈ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించామని ఆయన తెలిపారు. మంగళవారం జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2025 సెషన్లు ముగిసిన అనంతరం, విజన్–2047 డాక్యుమెంట్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “ఈ విజన్ డాక్యుమెంట్ ప్రభుత్వం మాత్రమే కాదు… తెలంగాణ ప్రజలందరిదీ” అని అన్నారు. సమ్మిళిత వృద్ధి, సమానాభివృద్ధి తెలంగాణ లక్ష్యమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి ప్రముఖ పరిశ్రమలు, సంస్థల నాయకులు భారీగా హాజరయ్యారు.ప్రపంచానికి హైదరాబాద్ ఒక ఐకానిక్ నగరం: దువ్వూరి సుబ్బారావు.తెలంగాణ వేగంగా ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాల్లో ఒకటని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచానికి ఐకానిక్ సిటీగా ఎదిగిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తున్న నగరాల్లో హైదరాబాద్ ముందుంటుందని తెలిపారు. విజన్ డాక్యుమెంట్‌లో భాగస్వామిగా ఉండటం సంతోషకరమని అన్నారు. చైనా వాంగ్‌డాంగ్ ప్రాంతాన్ని మించి తెలంగాణ అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక అభివృద్ధి దృష్ట్యా విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు.ప్రత్యేక మార్గం వైపు తెలంగాణ: ఆనంద్ మహీంద్రా .“తెలంగాణ విజన్–2047 చాలా ప్రేరణాత్మకంగా, మార్గదర్శకంగా ఉంది” అని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో తెలంగాణ ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్‌గా వ్యవహరించే అవకాశం తనను గర్వపడేలా చేస్తోందని తెలిపారు. “ఈ స్కిల్ యూనివర్సిటీ దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దబోయే శక్తిగా నిలుస్తుంది” అని ఆనంద్ మహీంద్రా అభివర్ణించారు.