|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 07:13 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం దేశవ్యాప్తంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలలో అత్యంత ముఖ్యమైనది.. దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలపడం. ఈ ప్రతిపాదనలో భాగంగా.. తెలంగాణ రాష్ట్రానికి నాలుగు (4) కొత్త కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేస్తూ కేంద్రం అదనపు చేయూతను అందించింది.
ఈ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటికే ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలకు ఈ నాలుగు కొత్త పాఠశాలలు తోడవడంతో, రాష్ట్రంలో మొత్తం కేంద్రీయ విద్యాలయాల సంఖ్య 39కి చేరుకుంది. ఈ కొత్త విద్యాలయాలు ముఖ్యంగా వెనుకబడిన, మారుమూల ప్రాంతాల విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
కొత్త కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్న ప్రాంతాలు, వాటి ప్రయోజనాలు ఇలా ఉన్నాయి. అందులో ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం పరిధిలో ఉంది. ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక విద్యార్థులకు, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారికి మెరుగైన ప్రాథమిక, సెకండరీ స్థాయి విద్య అందుబాటులోకి వస్తుంది.
మరొక కేంద్రం ములుగు జిల్లా పరిధలో ఏర్పాటు. ఇది గిరిజన ప్రాంతం కావడంతో.. ఇక్కడి విద్యార్థులకు కేంద్ర విద్యా ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విద్య లభిస్తుంది. జగిత్యాల జిల్లా - చెల్గల్, వనపర్తి జిల్లా - నాగవరం శివార్ లో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నారు. కేంద్రీయ విద్యాలయాల మంజూరుతో పాటు.. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణలో విద్యా రంగం బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారీగా నిధులను కేటాయించింది.
నూతన విద్యా విధానానికి అనుగుణంగా తెలంగాణలో పీఎం-శ్రీ పాఠశాలల అభివృద్ధికి కూడా కేంద్రం నిధులు మంజూరు చేయగా.. దీని ద్వారా కేంద్ర విద్యా సంస్థల విస్తరణ ద్వారా, విద్యార్థులు తమ సొంత ప్రాంతాల్లోనే మెరుగైన ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం అవుతుంది. ఇవి కాకుండా.. కేంద్ర కేబినెట్ సమావేశంలో 2027 జనగణన , మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు వంటి కీలక నిర్ణయాలపై కూడా చర్చించారు.