|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:47 PM
రాష్ట్రంలో జరిగిన తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచి ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు. కాంగ్రెస్ మద్దతుదారు అభ్యర్థులు ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయం స్పష్టంగా కనిపించిందని అన్నారు.మొదటి విడత ఎన్నికల్లో 90 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే విజయం సాధించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి ఈ ఫలితాలు నిదర్శనమని అన్నారు. ప్రజల ఆశయాలకు అద్దం పట్టే ఈ ఫలితాలు, ప్రభుత్వంపై వారి అపార నమ్మకాన్ని తిరిగి చాటుతున్నాయని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని వెల్లడించారు.నిరంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులను సమన్వయం చేస్తూ గ్రామ స్థాయి వరకు ప్రచార వ్యూహాలు రూపొందించి అమలు చేసిన విధానమే ఈ విజయానికి ప్రధాన కారణమని అన్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో ప్రజలను నేరుగా కలిసే పద్ధతి కాంగ్రెస్ పార్టీకి మరింత అనుకూలంగా మారిందని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండేళ్ల ప్రజాపాలన సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ప్రజలకు చేరువైందని అన్నారు.ప్రజా పాలన పట్ల ప్రజల సంతృప్తి పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిఫలించిందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.