|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 04:39 PM
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. స్థానిక ఎన్నికలు సహజంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 50 శాతం సీట్లు కూడా గెలవలేదని, కానీ గెలిచిన వారిలో చాలామందిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.ప్రజలకు ఆ పార్టీ పట్ల ఎంత విముఖత ఉందో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతుందని అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి క్వార్టర్లు బాగు చేయడానికి, సిబ్బందికి వేతనాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ సింగరేణి డబ్బులు రూ.100 కోట్లు పెట్టి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతున్నారని మండిపడ్డారు.హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చుతున్నారని, కానీ పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవెంట్ మేనేజర్‌లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో ఫుట్‌బాల్ ఆడుతున్నారని మండిపడ్డారు