|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 07:19 PM
రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ తాజాగా కీలక హెచ్చరిక జారీ చేసింది. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతీ ఒక్క సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు తేల్చి చెప్పారు. గత 2 ఏళ్లుగా ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. చాలా మంది కార్డుదారులు ఇప్పటికీ పూర్తి చేయకపోవడంపై అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ లోపు మిగిలిన వారందరూ తప్పనిసరిగా తమ ఈ-కేవైసీని పూర్తి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ గడువు విధించింది. ఈనెల 31వ తేదీ లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయని యూనిట్ల రేషన్ సరఫరాను నిలిపివేస్తామని.. వారి రేషన్ కోటా రద్దు అవుతుందని అధికారులు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ-కేవైసీ పూర్తి చేయడానికి.. రేషన్ కార్డులో నమోదైన సభ్యులు అందరూ తమ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి.. ఈ-పాస్ మెషీన్‌లో బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. అయితే.. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా కొంతమంది ఫింగర్ ప్రింట్స్.. ఆ ఈ-పాస్ మెషీన్‌లో నమోదు కావడం లేదని కార్డుదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
సాంకేతిక లోపాల కారణంగా ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే.. అది తమ తప్పు ఎలా అవుతుందని జనం అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. రేషన్ కోటా రద్దు అవుతుందనే ఆందోళన వారిలో నెలకొంది. దీంతోపాటు.. ఈ-కేవైసీ గడువును కూడా డిసెంబర్ 31వ తేదీ వరకు విధించగా.. దాన్ని ఆ తర్వాత కూడా పొడిగించాలని పలువురు వినియోగదారులు అధికారులను కోరుతున్నారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ఇటీవల మంజూరైన కొత్త రేషన్ కార్డుదారులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. తమకు రాకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం.. వంటగ్యాస్, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అందుతున్నప్పటికీ.. కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి ఈ పథకాలు అందడం లేదని వారు వాపోతున్నారు. తమకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.