|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 07:32 PM
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో ఏర్పాటు చేయదలచిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం విగ్రహంపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయినా తెలంగాణ వాదులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రాన్ని ఊపేసిన, ప్రతిఒక్కరిలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన.. "జయ జయహే తెలంగాణ.." గీతం పాడమంటే బాలసుబ్రహ్మణ్యం నిరాకరించారని చెప్పారు. అందుకే ఆయన విగ్రహం రవీంద్ర భారతి వంటి తెలంగాణ సాంస్కృతిక వేదిక వద్ద పెట్టడాన్ని తెలంగాణ వాదులంతా వ్యతిరేకిస్తున్నారని కవిత అన్నారు. కవిత వ్యాఖ్యలతో తెలంగాణ వాదులు చేస్తున్న వాదనకు బలం చేకూరినట్లు అయింది.
వేరే స్థలం చూసుకోండి..
రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయనున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో తాను తెలంగాణ వాదులకే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏస్పీ బాలు విగ్రహం రవీంద్ర భారతి వద్ద పెట్టవద్దని.. దాని కోసం ఇంకేదైనా స్థలం చూసుకోవడం మంచిదని నిర్వాహకులకు కవిత సూచించారు. అంతేకాకుండా రవీంద్ర భారతిలో కేవలం తెలంగాణ కళాకారుల విగ్రహాలు మాత్రమే పెట్టాలని తేల్చిచెప్పారు.
మరోవైపు, డిసెంబర్ 15న ఉదయం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు.. ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ అచ్యుత రామరాజు, కార్యదర్శి బీఎస్ కృష్ణమూర్తి ఇటీవల చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని బాలు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొంటారని చెప్పారు. ఏస్పీ బాలు విగ్రహం రవీంద్ర భారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
వారి విగ్రహాలు పెట్టండి..
ఎస్పీ బాలు విగ్రహాన్ని తెలంగాణలో పెట్టాల్సిన అవసరం లేదని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ఎందరో ప్రముఖులు ఉన్నారన్నారు. ముందుగా వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జానపద సినిమాలతో ప్రసిద్ధి చెందిన కత్తి కాంతారావు, ముచ్చర్ల సత్యనారాయణ, వరంగల్ శంకర్, సారంగపాణి, గద్దర్ లాంటి వారి విగ్రహాలు పెట్టాలన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, పైడి జయరాజ్ లాంటి తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెడితే మంచిదని చెప్పారు.