|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 07:28 PM
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే 2 విడతల సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ముగియగా.. బుధవారం రోజున జరగనున్న మూడో విడత ఎన్నికలతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రామాల్లో సర్పంచ్ పదవుల కోసం.. చాలా మంది పోటీ చేస్తున్నారు. చాలా గ్రామాల్లో ఇద్దరు, ముగ్గురి కంటే ఎక్కువ మంది పోటీలో ఉండి.. ఎన్నికలను రసవత్తరంగా మార్చుతున్నారు. డబ్బులు, మద్యం, గిఫ్ట్‌లు, బంగారం, వెండి ఆభరణాలతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పోలింగ్ ముందు రోజు అయితే సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.
సాధారణంగా సర్పంచ్ ఎన్నికల్లో గెలవాలని ఆలయాల్లో పూజలు చేస్తారు. దేవాలయాలను నిర్మించేందుకు నిధులు ఇస్తామని హామీలు ఇస్తారు. విరాళాలను ప్రకటిస్తారు. కానీ ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం.. పంచాయతీ ఎన్నికల్లో గెలవడం కోసం ఏకంగా క్షుద్ర పూజలు చేశారన్న వార్త రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఆదివారం రోజున రాష్ట్రంలోని వేల సంఖ్యలో గ్రామ పంచాయతీల్లో మూడో దశ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజలు జరగడం సంచలనంగా మారింది.
ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలో జరిగిన క్షుద్ర పూజలకు సంబంధించిన వీడియోలు బయటికి రావడంతో.. అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొండల రవికి వ్యతిరేకంగా ఈ క్షుద్ర పూజలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొండల రవికి.. ఈ ఎన్నికల్లో కత్తెర గుర్తును ఎన్నికల సంఘం అధికారులు కేటాయించారు. అదే కత్తెర గుర్తు కలిగి ఉన్న నమూనా బ్యాలెట్ పత్రానికి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు.
ఇక క్షుద్ర పూజలు చేసిన ఆ బ్యాలెట్ పత్రాన్ని నేరుగా గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు పెట్టి వెళ్లిపోయారు. తెల్లవారుజాముని పంచాయతీ ఆఫీస్ ముందు అది చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే తొండల రవికి ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారే.. ఈ క్షుద్ర పూజలు చేశారని గ్రామస్థులు ఆరోపిస్తుండటం సంచలనంగా మారింది. రెండో దశ ఎన్నికలు జరిగే రోజునే ఈ క్షుద్ర పూజలు కనిపించడం గోళ్లపాడు గ్రామంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రత్యర్థి అభ్యర్థులు చేశారా లేక ఇంకెవరైనా చేశారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.