|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 04:53 PM
రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచక పాలనకు చెంపపెట్టు లాంటివని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో గద్దెనెక్కిందని, ఇప్పుడు ఆ పార్టీకి రాష్ట్రంలో కాలం చెల్లిందని పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించిన బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ ప్రభుత్వ పెద్దలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటలు బీటలు వారడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సైతం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారని, ఇందుకు కృషి చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రేవంత్ రెడ్డి రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలు, గ్యారెంటీల అమలులో చేసిన ఘోరమైన మోసాలే కాంగ్రెస్ పార్టీకి ఉరితాళ్లుగా మారాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ వైఫల్యాలే ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో కూకటివేళ్లతో పెకిలిస్తున్నాయని ఉద్ఘాటించారు.గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం ఏకపక్షంగా విజయాలు సాధించిందని, కానీ నేడు కాంగ్రెస్ కనీసం సగం పంచాయతీలను కూడా గెలవలేకపోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇది అధికార పార్టీపై పల్లెల్లో పెల్లుబుకుతున్న ప్రజాగ్రహానికి స్పష్టమైన సంకేతమని వివరించారు. పార్టీ గుర్తు లేని ఎన్నికల్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక పార్టీ గుర్తుపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇంతకన్నా ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు.కాంగ్రెస్ అభయహస్తం కాదని, అదొక రిక్త హస్తమని రెండేళ్ల పాలనలోనే తేలిపోయిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి రేవంత్ అసమర్థ పాలనలో అధికార పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను విడిపించే పోరాటంలో తమకు అండగా నిలుస్తున్న ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుతున్నట్లు చెప్పారు. కష్టకాలంలో పార్టీ వెన్నంటి నిలిచిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, వారి ఉజ్వల రాజకీయ భవిష్యత్తుకు పార్టీ బంగారు బాటలు వేస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.