|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 10:59 AM
- వచ్చే వారం నుంచి 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం..
- అధికారులతో కలిసి మాధాపూర్‌లో ఎండీ అవగాహనా కార్యక్రమం..
జలమండలి పరిధిలో 200 గజాల ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు అవసరం.. 300 గజాల పైన ఉన్న ప్రతి ప్రాంగణంలో ఇంకుడు గుంత తప్పనిసరి నిర్మాణం చేసుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా జలమండలి ఇంకుడు గుంతల ప్రాధాన్యం, వాటి నిర్మాణ ఆవశ్యకత ప్రజలకు తెలపడానికి.. జలమండలి 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను రూపొందించిందని చెప్పారు. జిహెచ్ఎంసీ నుండి ఓఆర్ ఆర్ వరకు భూగర్భ జలాలను పెంచే లక్ష్యంగా.. ఇంటికో ఇంకుడు గుంత కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ నేపధ్యంలో సోమవారం ఈ రోజు అధికారులతో కలిసి మాధాపూర్‌లో పర్యటించారు. కాకతీయ హిల్స్ ప్రాంతంలో ఉన్న 15 ఫ్లాట్ల ఓ అపార్ట్‌మెంట్ వాసులు ఇంజక్షన్ బోర్ వెల్ తో నీటి సమస్య లేకుండా చేసిన తీరు ప్రశంసనీయమని ఎండీ అన్నారు. ఈ చర్య జలమండలి లక్ష్యాలకు అనుగుణంగా ప్రజల భాగస్వామ్యంతో సాధ్యమయ్యే ఉత్తమ నీటి సంరక్షణకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.
ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. ఓఆర్ ఆర్ పరిధిలో భూగర్భ జలాలను పెంచే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశంతో జలమండలి 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను రూపొందించిందని చెప్పారు. జలమండలి భూగర్భజలాల పెంపు కోసం ఇంకుడు గుంతల కార్యక్రమంలో ప్రతి నివాస సముదాయలు తమ కర్తవ్యంగా భావించి భాగస్వామ్యం అవసరమని అశోక్ రెడ్డి అన్నారు.
ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత:నగరంలో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదవుతున్నా... పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరిస్తున్న నివాస, వాణిజ్య సముదాయలతోపాటు ఖాళీ స్థలాలు, బహిరంగ ప్రదేశాలన్నింటిని కాంక్రీట్‌తో కప్పేస్తుండటంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేక భూగర్భజలాలు అడిగంటిపోతున్నాయి. ఫలితంగా తాగు నీటి కంటే నిత్యావసరాల నీటికోసం ట్యాంకర్ల డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్‌లో ప్రతి ఏటా సగటున 85 నుంచి 89 సెంటీ మీటర్లకుపైగా వర్షపాతం నమోదవుతున్నా.. అందులో కేవలం 0. 75 నుంచి 0.95 శాతం మాత్రమే నేలలోకి ఇంకడం మిగితాది వరద రూపంలో మురుగు కాల్వలో కలిసి వృధాగా పోవడం సర్వసాధారణమైంది.గత ఏడాది జలమండలి ఎండీ క్షేత్ర స్థాయిలో పర్యటించి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా డిమాండ్‌కు గల వాస్తవ పరిస్ధితిపై ఆరా తీశారు. గృహా సముదాయాల్లో ఎండిపోతున్న బోర్లుగా ప్రధాన సమస్యగా గుర్తించారు. పాతాళంలోకి పడిపోతున్న భూగర్భజలాల పెంపుపై కోసం ప్రత్యేక కార్యాచరణకు దిగారు. తాగు నీటి సరఫరాతో పాటు .. నిత్యావసరాల వినియోగించే నీరు అందుబాటులో ఉండే విధంగా వర్షపునీటి సంరక్షణకు నడుం భిగించారు. అందులో భాగంగా నల్లా కనెక్షన్ క్యాన్ నెంబర్ ఆధారంగా సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతి నెలా 20 కంటే ఎక్కువ ట్యాంకర్లను బుక్ చేసుకునే ప్రాంగణాలను గుర్తించింది. ఇప్పటికే సుమారు 40 వేల పైగా క్యాన్ నెంబర్లను గుర్తించి 40,209 నివాససముదాయలపై సర్వే నిర్వహించగా, కేవలం 22,825 నివాసాల్లో నే ఇంకుడు గంతలు ఉన్నట్లు,17,384 నివాసాల్లో ఇంకుడు గుంతలు లేనట్లు బహిర్గతమైంది. దీంతో ఇప్పటివరకు16 వేల గృహాలకు నోటీసులు చేసి ఇంకుండు గుంత నిర్మాణం చేపట్టేలా చర్యలు చేపట్టింది. మరో 25 వేల గృహాలకు వచ్చే మార్చి నాటికీ ఇంకుగుంతలు చేపట్టేలా కార్యాచరణ రూపకల్పన చేసింది.
వర్షపు నీటి సంరక్షణలో భాగంగా 300 చదరపు మీటర్ల గల ప్రతి ఇంటా భూగర్భ జలాలను రీస్టోర్ చేసుకునే దిశగా ప్రాంగణంలో ఇంకుడుగుంత తప్పని సరి చేస్తూ జలమండలి చర్యలు చేపట్టింది. పాత, కొత్త నివాస, వాణిజ్య సముదాయాలపై దృష్టి సారించింది. భూగర్భజలాల పెంపు కోసం ప్రజా స్థలాలో ఇంకుడు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రజా స్థలాలు,కాలనీలు,ప్రభుత్వ సముదాయాలు, విద్యా సంస్ధలు,రోడ్డు పక్కన గల నివాస, వాణిజ్యసముదాయల రూఫ్ టాప్ నుండి కిందికి పడే వర్షపు నీటిని పైపుల ద్వారా సంరక్షణ కోసం ప్రజా ఇంకుడు గుంతల ఏర్పాటుకు సిద్దమైంది. అలాగే నిరుపయోగంలో ఉన్న బోరు బావులను హార్వెస్టింగ్ పిట్‌లతో ఇంజక్షన్ బోర్‌వెల్‌గా మార్చాలని నిర్ణయించింది.
వీటితోపాటు ఓఆర్ ఆర్ పరిధిలోని గెటెడ్ కమ్యూనిటీలు, బహు అంతస్తుల భవన సముదాయాల్లో కమ్యూనిటీ ఇంకుడు గంత ఏర్పాటు చేసుకునే విధంగా ప్రత్యేక అవగాహన కార్యాక్రమాలు ఏర్పాటు చేయనుంది. ఓఆర్‌ఆర్ లోపల, అవతల గెటెడ్ కమ్యూనిటీలు, బహుళ అపార్ట్ మెంట్లను గుర్తించారు. అయా నివాస సముదాయలకు ఇంకుడు గుంతల ప్రాధాన్యం, వాటి నిర్మాణ ఆవశ్యకతలపై అవగాహన కల్పిస్తారు.