|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 07:28 PM
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) చరిత్రలో ఒక భారీ మార్పు చోటు చేసుకుంటోంది. నగర విస్తీర్ణం ఊహించని రీతిలో పెరగడంతో.. పరిపాలన సౌలభ్యం కోసం చేపట్టిన వార్డుల విభజన ప్రక్రియపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ కీలక వివరాలను వెల్లడించారు. ఈ విభజన కేవలం ప్రస్తుత అవసరాల కోసమే కాకుండా.. భవిష్యత్తులో పెరగబోయే జనాభాను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయంగా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
గతంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అంటే ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇలా వేర్వేరు పాలనా వ్యవస్థలు ఉండేవి. అయితే.. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో జీహెచ్‌ఎంసీ పరిధి 650 చదరపు కిలోమీటర్ల నుండి 2060 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. సుమారు 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేశారు. దీని వల్లనే వార్డుల పెంపు జరిగిందన్నారు. దీంతో దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన కార్పొరేషన్‌గా హైదరాబాద్ అవతరించింది. అందుకే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో వార్డుల హద్దులను నిర్ణయించారు.
వార్డుల పునర్విభజన కేవలం అంకెలకు పరిమితం కాకుండా.. భౌగోళిక పరిస్థితులను బట్టి చేశామన్నారు. రైల్వే లైన్లు, ప్రధాన రహదారులు, నాలాలను హద్దులుగా తీసుకున్నట్లు తెలిపారు. గతంలో కొన్ని వార్డులు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉండేవి. ఇప్పుడు అటువంటి సమస్య లేకుండా ఒకే నియోజకవర్గ పరిధిలోకి వచ్చేలా జాగ్రత్త పడ్డారు. ఉదాహరణకు తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం జనాభా తక్కువగా ఉన్నా.. రాబోయే ఐదేళ్లలో అక్కడ భారీ అపార్ట్‌మెంట్లు, కట్టడాల వల్ల జనాభా 4 లక్షలు దాటే అవకాశం ఉంది.
అందుకే అటువంటి చోట్ల వార్డుల సంఖ్యను పెంచారు. వార్డుల విభజనపై వచ్చిన ప్రతీ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. వార్డుల పేర్లు మార్చాలని, అలాగే కొన్ని ప్రాంతాల్లో సరిహద్దులపై అభ్యంతరాలు ఎక్కువగా వచ్చాయి. లిఖితపూర్వక అభ్యంతరాలు సమర్పించడానికి రేపు ఆఖరి రోజన్నారు. నగర విస్తీర్ణం పెరగడంతో చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్ ఎమ్మెల్యేలను కూడా కౌన్సిల్ సమావేశాలకు ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిసెంబర్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తే, రాబోయే జనగణన సమయానికి స్పష్టమైన గణాంకాలు అందుబాటులో ఉంటాయి. ఈ భారీ కసరత్తుతో హైదరాబాద్ నగరం మరింత పకడ్బందీగా అభివృద్ధి చెందుతుందని అధికారులు భావిస్తున్నారు.