|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 07:38 PM
సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఓట్ల కోసం రకరకాల వాగ్దానాలు కురిపిస్తుంటారు. గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడంలో కొందరు కాలయాపన చేస్తే.. మరికొందరు అసలు ఆ ఊసే ఎత్తరు. కానీ... రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక మహిళా సర్పంచ్ మాత్రం ‘మాట ఇస్తే మడమ తిప్పని’ నేతగా నిలిచారు. గెలిచిన మరుసటి రోజే తన తొలి హామీని నెరవేర్చి ప్రజల మనసు గెలుచుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా.. ఇల్లంతకుంట మండలం, కందికట్కూరు గ్రామంలో గత కొంతకాలంగా కోతుల సమస్య తీవ్రంగా ఉంది. కోతులు ఇళ్లపైకి రావడం, తినుబండారాలను ఎత్తుకెళ్లడం, పిల్లలను భయపెట్టడం, పంటలను నాశనం చేయడంతో గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను ఎవరూ పరిష్కరించలేకపోయారు.
పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన చింతపల్లి విజయమ్మ గ్రామంలోని ప్రధాన సమస్యను గుర్తించారు. ప్రచార సమయంలో ఆమె గ్రామస్తులకు ఒక కీలక హామీ ఇచ్చారు. ‘నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే.. గ్రామంలో కోతుల బెడద లేకుండా చేస్తాను’ అని స్పష్టం చేశారు. గ్రామస్తులు ఆమె మాటలను నమ్మి.. భారీ మెజారిటీతో ఆమెను సర్పంచ్ గా గెలిపించారు. ఎన్నికల ఫలితాలు రాగానే సంబరాల్లో మునిగిపోకుండా.. విజయమ్మ తన బాధ్యతను గుర్తుంచుకున్నారు.
సర్పంచ్ గా గెలిచిన మరుసటి రోజే సొంత నిధులతో రంగంలోకి దిగారు. కోతులను పట్టే నిపుణులను గ్రామానికి రప్పించారు. గ్రామంలోని వివిధ వీధుల్లో తిరుగుతున్న సుమారు 100కు పైగా కోతులను చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుకున్న కోతులను సురక్షితమైన బోన్లలో బంధించి, గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా దూరంగా ఉన్న దట్టమైన అడవిలో వదిలిపెట్టేలా చర్యలు తీసుకున్నారు.
తను ఇచ్చిన చిన్నపాటి హామీని కూడా ఇంత చిత్తశుద్ధితో నెరవేర్చడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ అంటే ఇలా ఉండాలని.. మాట తప్పని నాయకురాలు అంటూ చుట్టు పక్కల గ్రామస్తులు కొనియాడుతున్నారు. మిగిలిన గ్రామాల్లోని నూతన సర్పంచ్‌లు కూడా ఇదే విధంగా ప్రజల స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి.. ఇచ్చిన హామీలను నెరవేరిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కోతుల సమస్య తీరడంతో గ్రామస్తులు ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేయడమే కాదు.. ప్రజల నిత్యజీవిత సమస్యలను పరిష్కరించడం కూడా అని విజయమ్మ నిరూపించారు.