|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 07:23 PM
కేంద్ర ప్రభుత్వం.. రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే అంశంపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు స్టేషన్లలో మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించడం కోసం అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా తెలంగాణలో మొత్తం 42 రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ కింద.. రాష్ట్రంలోని 42 స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, అత్యాధునిక డిజైన్లు, ఆధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పలు స్టేషన్లలో ఈ సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు.
కేంద్ర ప్రభుత్వం.. రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం అమృత్ భారత్ రైల్వేస్టేషన్ పథకం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా కాజీపేట రైల్వేస్టేషన్‌లో ఒకటి, రెండో నంబరు ప్లాట్‌ఫాంల మీద ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్‌లో ఇప్పటికే ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్‌వోబీ) ఏర్పాటు చేశారు. అలానే దీనికి అదనంగా అత్యాధునిక విధానంలో.. మరో కొత్త వంతెన నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం దీని పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. దీని వల్ల.. రైలు ప్రయాణికులు ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాం మీదకు వెళ్లడానికి సులభంగా ఉంటుంది.
ఇక ఈ ఎస్కలేటర్లు ఎక్కలేనివారు.. పెద్ద మొత్తంలో లగేజీ తీసుకెళ్లేవారు.. అనారోగ్యం బారిన పడిన వారు వెళ్లేందుకు గాను ర్యాంప్ నిర్మాణం చేపట్టగా.. అది కూడా పూర్తయ్యింది. దీనికి రెండు వైపులా లిఫ్ట్‌లను కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్‌కి అనుబంధంగా నిర్మిస్తోన్న రైల్వే స్టేషన్ పనులు ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయి. ఇంకో 5 శాతం పనులు మిగిలి ఉన్నాయని తెలిపారు. వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి మల్లన్న భక్తులకు అంకితం చేయాలని అధికారులు భావిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. వీలైనంత త్వరగా ఈ రైల్వే స్టేషన్‌కు సంబంధించి మిగిలి ఉన్న పనులను పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. అలానే హైదరాబాద్ నగర ప్రయాణికులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న ఎంఎంటీఎస్ రెండో దశ నెట్‌వర్క్ విస్తరణపైన కూడా చర్చ జరుపుతున్నారు.