|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 02:36 PM
తెలంగాణ రాష్ట్రంలో కోతుల బెడద దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఉంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలో కొన్ని గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు ముందుగానే బోనులు ఏర్పాటు చేసి కోతులను పట్టుకున్నారు. కోతుల బెడదను తప్పిస్తే ఓటు వేస్తామని చెప్పిన ఓటర్లు కూడా కొన్ని గ్రామాల్లో ఉన్నారు. అయితే, నిర్మల్ జిల్లాలో సర్పంచ్‌గా గెలిచిన ఒక యువకుడు తన గ్రామానికి కోతుల బెడదను తగ్గించేందుకు తానే ఎలుగుబంటి వేషం వేశాడు.జిల్లాలోని కడెం మండలం లింగాపూర్‌లో బీఆర్ఎస్ బలపరిచిన కుమ్మరి రంజిత్ సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఎన్నికైన తరువాత గ్రామం నుంచి కోతులను తరిమి కొట్టేందుకు ఎలుగుబంటి వేషం వేశాడు. ఆ వేషం చూసి కోతులు అక్కడి నుంచి పారిపోయాయి. ఇలాంటి ఎలుగుబంటి దుస్తులను మరో రెండు మూడు తెప్పించి కోతులు రాకుండా చేస్తానని రంజిత్ హామీ ఇచ్చాడు.ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ, గత రెండు మూడేళ్లుగా తమ గ్రామంలో కోతుల బెడద ఎక్కువైందని అన్నాడు. ఇంటింటికి కొంత మొత్తం వసూలు చేసి బోనులు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపాడు. గ్రామానికి ఈ బెడద తప్పించేందుకు ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో యూట్యూబ్‌లో చూడగా ఈ ఆలోచన వచ్చిందని అన్నాడు. ప్రభుత్వం కూడా అన్ని గ్రామాల్లో కోతుల బెడదను తప్పించాలని విజ్ఞప్తి చేశాడు.