|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 02:27 PM
నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండల కేంద్రంలో ఒక వ్యక్తి పంట రుణం చెల్లించడానికి బ్యాంకుకు తెచ్చిన నగదు నకిలీదని బ్యాంకు అధికారులు గుర్తించడంతో ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. జలాల్పూర్ గ్రామానికి చెందిన రైతు నరెడ్ల చిన్నసాయిలు తన పంట రుణం చెల్లించేందుకు గురువారం సాయంత్రం వర్ని మండల కేంద్రంలోని కెనరా బ్యాంకుకు వచ్చాడు. అతడు రూ.2,08,500 రుణం చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తాన్ని రూ.500 నోట్లు రూపంలో తీసుకువచ్చాడు.క్యాష్ కౌంటర్ వద్ద నగదును అందించగా, కౌంటింగ్ యంత్రం ద్వారా లెక్కిస్తుండగా నకిలీ నోట్లు బయటపడ్డాయి. అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది మొత్తం నగదును పరిశీలించగా అన్నీ నకిలీ నోట్లుగా తేల్చారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావని బ్యాంకు సిబ్బంది రైతును ప్రశ్నించగా, అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.బ్యాంకు అధికారులు నాలుగు రూ.500 నోట్ల కట్టలలో ఒక్కొక్క కట్టపై ఒకే రకమైన సీరియల్ నెంబర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై బ్యాంకు అధికారులు వర్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారి పంకజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారైన రైతు కోసం పోలీసులు గాలిస్తున్నారు.