|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 04:47 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మంత్రి పదవి ఆశలపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదృష్టం ఉంటే తనకు త్వరలోనే మంచి పదవి లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఓపిక పట్టానని, త్వరలోనే మంత్రిని అవుతానని ఆయన అన్నారు. ఆయన తాజా వ్యాఖ్యలతో మంత్రి పదవి అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.చాలాకాలంగా మంత్రి పదవిని ఆశిస్తున్న రాజగోపాల్ రెడ్డి, ఈ విషయంపై పలుమార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో అధిష్ఠానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు అది నెరవేరలేదని గతంలో మీడియా సమావేశాల్లో వ్యాఖ్యానించారు. పార్టీలోని పరిణామాలపై కూడా కొన్ని సందర్భాల్లో ఆయన వివాదాస్పదంగా మాట్లాడారు.ఎమ్మెల్యేగా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని, అదే మంత్రి పదవి లభిస్తే నియోజకవర్గాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే, గతంలో అసహనంతో మాట్లాడిన ఆయన, ఇప్పుడు సానుకూల ధోరణితో మాట్లాడుతుండడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అధిష్ఠానం నుంచి మంత్రి పదవిపై ఆయనకు ఏమైనా సానుకూల సంకేతాలు అందాయా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి