|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 02:40 PM
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆరా తీశారు. తనను కలిసిన బీఆర్ఎస్ ఎంపీలతో ‘‘కేసీఆర్ ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. ఈ మాట నేను ప్రత్యేకంగా చెప్పానని ఆయనకు తెలియజేయండి’’ అని మోదీ సూచించారు.శుక్రవారం పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిరిసిల్ల వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి-365బిని వేములవాడ మీదుగా కోరుట్ల వరకు పొడిగించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ అంశాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే కేంద్రం దృష్టికి తెచ్చారని, గతంలో కేంద్ర మంత్రి ఒకరు హామీ ఇచ్చారని వారు ప్రధానికి గుర్తుచేశారు. ఈ రహదారి విస్తరణతో వేములవాడ క్షేత్రానికి ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుతుందని వివరించారు.ఈ క్రమంలో మిడ్ మానేరుపై ధవళేశ్వరం తరహాలో రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి నిర్మించాలని, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పనుల్లో సహకరించాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలన్నీ విన్న తర్వాత ప్రధాని మోదీ.. కేసీఆర్ బాగోగుల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.