|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 08:16 PM
రాష్ట్రంలోని వివిధ వర్గాల నుంచి వస్తున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి, అన్ని శాఖలతో సమన్వయం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బేగంపేటలోని ప్రజాభవన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ప్రజావాణి రెండో వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజావాణి ఇన్‌ఛార్జ్‌లు తదితరులు పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులు తమ అనుభవాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని అన్నారు. ప్రజావాణి ప్రారంభించిన రెండేళ్లలో ఇప్పటి వరకు 74 శాతం ఫిర్యాదులు పరిష్కరించామని వెల్లడించారు. ప్రజావాణికి స్పందన లేదని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆక్షేపించారు. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.అధికారానికి దూరమైన బీఆర్ఎస్ ఎన్ని విమర్శలు చేసినా తాము మరింత ముందుకు వెళతామని ఆయన అన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో వనరులు ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజావాణిని విజయవంతం చేసిన వారికి ఆయన అభినందనలు తెలియజేశారు.