|
|
by Suryaa Desk | Sun, Aug 03, 2025, 09:36 PM
హైదరాబాద్ పరిసరాల్లోని పోచారం, నాగోలు బండ్లగూడ ప్రాంతాల్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ శనివారం ముగిసింది. అయితే, దరఖాస్తుదారుల విజ్ఞప్తి మేరకు మిగిలిన ఫ్లాట్లకు మరో వారం రోజుల పాటు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దీనితో పాటు, స్వగృహకు చెందిన ఓపెన్ ప్లాట్లను కూడా బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు.
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మార్కెట్ ధరల కంటే తక్కువకు, 'నో లాస్ నో ప్రాఫిట్' పద్ధతిలో మొత్తం 401 ఫ్లాట్లను విక్రయించింది. ఈ ప్రక్రియ ద్వారా సుమారు రూ. 78 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధిక శాతం ఫ్లాట్లకు ఒకే దరఖాస్తు రాగా, ఒక 3BHK ఫ్లాట్‌కు ఏకంగా 69 దరఖాస్తులు వచ్చాయి. బండ్లగూడలో ఫ్లాట్లు లభించని వారికి పోచారంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి, లాటరీ ద్వారా కేటాయింపులు చేశారు.
బండ్లగూడ, పోచారంలలో మిగిలిపోయిన సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రజలు కోరడంతో.. ఆగస్టు 8వ తేదీ వరకు గడువు పొడిగించారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఈ ఫ్లాట్లను కేటాయించనున్నట్లు స్వగృహ కార్పొరేషన్ ఎండీ వీపీ.గౌతమ్ తెలిపారు.ఇవే కాకుండా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు చెందిన ఓపెన్ ప్లాట్లను కూడా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. ఈ వేలం ఆగస్టు 4 (సోమవారం) నుంచి మూడు రోజుల పాటు జరగనుంది.
ఆగస్టు 4న రంగారెడ్డి జిల్లా కుర్మల్‌గూడలో 20 ప్లాట్లు, ఆగస్టు 5న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బహదూర్‌పల్లిలో 69 ప్లాట్లు, ఆగస్టు 6న రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 100 ప్లాట్లు విక్రయించనున్నారు. ఈ ప్లాట్లు 200 చదరపు గజాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. బహిరంగ మార్కెట్ ధర కంటే కాస్త తక్కువగానే ఈ ఫ్లాట్లు విక్రయించనున్నారు. హైదరాబాద్ నగరంలో సొంతింటి కలను నిజం చేసుకునేవారు ఈ ఫ్లాట్లు కొనుగోలు చేయాలని సూచించారు.