|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 10:52 AM
నాలాలు, వరద కాలువల కబ్జాలను హైడ్రా సీరియస్‌గా తీసుకుంది. భరత్‌నగర్ - ఖైతలాపూర్ మార్గంలోని కాముని చెరువు - మైసమ్మ చెరువులను కలుపుతూ సాగే వరద కాలువను కబ్జా చేసిన వాసవీ నిర్మాణ సంస్థపై హైడ్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. 17 మీటర్ల వెడల్పుతో పాటు.. ఇరువైపులా 9 మీటర్ల చొప్పున బఫర్ విడిచి పెట్టకుండా.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీరంగనాథ్‌గారు బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలోని ముల్లకత్వ చెరువు - కాముని చెరువు - మైసమ్మ చెరువులను కలుపుతూ వెళ్లే వరద కాలువలో మట్టి పోసినట్టు నిర్ధారణ అయ్యింది. నిర్మాణ సంస్థపై కేసు పెట్టాలని హైడ్రా కమిషనర్ అధికారులను ఆదేశించారు. నాలా ఆక్రమణలను వెంటనే తొలగించాలని సూచించారు. ఈ మేరకు హైడ్రా అధికారులు జేసీబీలతో, టిప్పర్లతో మట్టిని తొలగించారు. ఆ మట్టిని వాసవీ నిర్మాణ సంస్థకు చెందిన స్థలంలోనే పడేశారు. వరద కాలువను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారంటూ వాసవీ నిర్మాణ సంస్థపై కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతమేర ఇరువైపులా రిటైనింగ్ వాల్స్‌తో నిర్మించిన కాలువ మధ్యలో స్లాబ్ వేసేందుకు ఉద్దేశించిన పిల్లర్లను కూడా తొలగించాల్సి ఉందని హైడ్రా అధికారులు గుర్తించారు. వాసవీ సరోవర్ పేరిట ఖైతలాపూర్‌లో నిర్మాణాలు చేపడుతున్నప్పుడే వరద కాలువకు సంబంధించిన నిబంధనలను పాటించాలని హైడ్రా హెచ్చరించిన విషయాన్ని అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.