|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 06:59 PM
అంతర్గత కలహాలతో సతమతమవుతున్న బీఆర్‌ఎస్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల పరాజయం.. ఆపరేషన్ ఆకర్ష్‌తో పాటు పలు కేసుల వ్యవహారాలతో పార్టీ అష్టకష్టాలు పడుతుంటే.. ఇప్పుడు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పడం గులాబీ శ్రేణులను కలవరపరుస్తోంది. ఈ పరిణామాల మధ్య అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా బీఆర్‌ఎస్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సోమవారం ఆయన తన రాజీనామా లేఖను అధినేత కేసీఆర్‌కు పంపించడం, దాని వెనుక ఉన్న కారణాలు గులాబీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
గువ్వల బాలరాజు రాజీనామా..
బీఆర్‌ఎస్ పార్టీకి అత్యంత నమ్మకస్తుడిగా, కీలక నాయకుడిగా ఉన్న గువ్వల బాలరాజు రాజీనామా చేయడం ఆ పార్టీకి ఊహించని షాక్. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బాలరాజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కారణాలున్నట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ముఖ్యంగా.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి పరిణామాలు పార్టీకి మరింత నష్టం కలిగిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజీనామాకు దారితీసిన అసలు కారణాలు ఇంకా వెల్లడి కానప్పటికీ.. ఆయన ఈ నెల 9న బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీలో నాయకత్వ పరంగా కొంత గందరగోళం నెలకొంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ క్రియాశీలకంగా లేకపోవడం.. కేటీఆర్, హరీష్‌రావుల మధ్య సమన్వయం లోపించడం వంటి అంశాలు పార్టీని బలహీనపరుస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ బీఆర్‌ఎస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. చాలామంది ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇది కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అంతే కాకుండా.. పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగంగానే పార్టీ అధిష్టానంపై వ్యతిరేక రాగం పాడుతున్నారు. ‘లిల్లీపుట్ నాయకులు’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విబేధాలను స్పష్టం చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుండటం బీఆర్‌ఎస్ నేతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు, భూముల వ్యవహారాలపై ప్రభుత్వం విచారణలు వేగవంతం చేయడం, కేసులు నమోదు చేయడం బీఆర్‌ఎస్ నాయకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నాయకుల వలసలు, అంతర్గత కలహాలు, కేసుల భయంతో కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారు. పార్టీ భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడంతో చాలామంది సైలెంట్ అయ్యారు. ఈ పరిణామాలన్నీ బీఆర్‌ఎస్‌ను ఒక క్లిష్ట పరిస్థితిలోకి నెట్టాయి. గువ్వల బాలరాజు వంటి కీలక నేత రాజీనామా చేయడం, ఆయన వెంట మరికొందరు వెళ్లే అవకాశం ఉందనే వార్తలు గులాబీ పార్టీని మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉంది. ఈ సవాళ్లను బీఆర్‌ఎస్ అధిష్టానం ఎలా ఎదుర్కొంటుందో.. పార్టీని తిరిగి గాడిన పెట్టడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తుందో వేచి చూడాలి.