|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 06:32 AM
బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. జగదీశ్ రెడ్డిని 'లిల్లిపుట్' అంటూ సంబోధించిన కవిత, కేసీఆర్ నీడలో బతికే ఆయనకు సొంత అస్తిత్వం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై జగదీశ్ రెడ్డి కూడా అంతే స్థాయిలో స్పందిస్తూ సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు. కవిత, తనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్న అనుచిత వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్‌లోని కొందరు ముఖ్య నేతల హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. "పార్టీలోని ఒక అగ్రనేత ప్రోద్బలంతోనే నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ నేతలు ఎవరూ దీనిపై మాట్లాడటం లేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగదీశ్ రెడ్డిని ఉద్దేశిస్తూ, "కేసీఆర్ అనే నీడ లేకపోతే మీరెవరు నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశారు. తర్వాత పార్టీలో చేరిన ఓ చిన్న నేత కూడా నా విశ్వసనీయతను ప్రశ్నించే స్థాయికి వచ్చారు" అని మండిపడ్డారు.తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టాలని చూస్తున్నారని, అయితే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని, చేసిన వారికి తగిన ఫలితం దక్కుతుందని కవిత అన్నారు. కొద్ది నెలల క్రితం కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ అయిన నాటి నుంచి కవిత అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. "కేసీఆర్ ఒక దేవుడు, కానీ ఆయన చుట్టూ రాక్షసులు చేరారు" అని ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.