|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 03:57 PM
ఇరవై మంది సీమాంధ్ర పెట్టుబడుదారులు ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు ,సమయం వచ్చినప్పుడు వారి బండారం బయట పెడతా అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.తెలంగాణ సంపద లూటీ విషయంలో , కాంట్రాక్టుల విషయంలో , భూముల విషయంలో , ఇసుక మాఫియా విషయంలో గాని తెలంగాణ ప్రాంతానికి , ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా అన్నారు. మునుపటి ప్రభుత్వం మాదిరిగా సీమాంధ్ర పెట్టుబడిదారులు వచ్చి తెలంగాణలో కోట్ల రూపాయలు దోచుకుంటామంటే కుదరదు ,అవసరమైతే ఇంకో పోరాటం చేస్తాం, భయపడేది లేదని అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీ చేస్తమంటే చూస్తూ ఊరుకోం ,పదవుల కోసం దిగజారి ప్రవర్తించేది లేదని, ప్రజల కోసం ఎటువంటి త్యాగమైనా చేస్తామని అన్నారు.
తెలంగాణ సమాజానికి , పేద ప్రజలకు అండగా ఉండాలి అన్న లక్ష్యంతో రాజకీయాలలో ఉన్నాను, అటువంటి నన్ను మంత్రి పదవి రాలేదని వ్యాఖ్యలు చేసే కొంత మంది వ్యక్తులకు నాది ఒకటే సమాధానం అన్నారు. నేనే బీఆర్ఎస్ లకు పోతే కేసీఆర్ ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చే టోడు అన్నారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తినైతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఎందుకు చేస్తా అని ప్రశ్నించారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడు కాళ్ల దగ్గరకు తీసుకువచ్చాను , పదవి కావాలంటే బీజేపీ నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవాన్ని అన్నారు. తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు రజనీకాంత్ ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు బుధవారం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిసిన సందర్భంగా మాట్లాడుతూ సొంత పార్టీ నేతలపై కూడా విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోరాటం చేస్తున్న , ప్రజల పక్షాన పని చేస్తా , తనకు పదవి రావడం 20 నెలలు ఆలస్యమైనా బాధ లేదు కానీ ఈ ప్రభుత్వం లో ఉన్న పెద్దలు భాష మార్చుకుని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకోవాలని, వీలైనంత త్వరగా ఖాళీగా ఉన్న మంత్రి పదవులు భర్తీ చేయాలని, త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని సూచించారు. 20 నెలలుగా గ్రామాలు అభివృద్ధికి నోచుకోక భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. ఓడ దాటేంత వరకు ఓడ మల్లయ్య, ఒడ్డుకు చేరిన తర్వాత బోడ మల్లయ్య అనేలా డిజిటల్ మీడియా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని విమర్శించారు .కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా భాష, హవా భావాలు మార్చుకుని , తక్కువ మాట్లాడి మంత్రి వర్గంలో అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి,మేథావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో కూల్ మైండ్ తో పని చేయాలని ఆయన సీఎంకు హితవు పలికారు.
ఇంకా మూడున్నరేండ్లు గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటరు , ఆ తర్వాత ఎవరుంటరేనేది ఎన్నికల తర్వాత చూద్దాం అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద, పీసీ ఘోష్ నివేదిక మీద అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు . ముఖ్యమంత్రి కైనా, ప్రభుత్వానికైనా నా సలహా ఏమిటంటే తెలంగాణ ప్రజలు గత పదేండ్ల పాటు కేసీఆర్ కుటుంబంతో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ భగీరథ అని , స్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా లక్షల కోట్లు దోచుకుని ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన మాట వాస్తవమన్నారు.పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు వచ్చి 20 నెలలు అవుతోంది, తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు , దోపిడికి వ్యతిరేకంగా అవినీతికి పాల్పడిన వారిని తీసుకువచ్చి రోడ్డుమీద నిలబెడుతామన్నారు, నేను కూడా అడుగుతున్నా 20 నెలలుగా ఏం చేశారు ? ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇప్పటికైనా మీరు మాటలు తక్కువ చేసి అవినీతికి పాల్పడి లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు .