|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 04:28 PM
హైదరాబాద్ నగరంలో ఈ మధ్య కాలంలో ఊహించని ప్రమాదల బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొన్నిరోజుల క్రితం ఫ్రిజ్ డోర్ ఒపెన్ చేస్తుండగా.. కరెంట్ షాక్‌తో ఓ మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా నగరంలో మరో చోట పెను ప్రమాదం వెలుగు చూసింది. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి.. రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. మేడ్చల్ లో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. సిలిండర్ పేలుడుకు సంబంధించిన భయానక దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు..
శ్రీరాములు గౌడ్ అనే వ్యక్తికి మేడ్చల్ పట్టణంలో మార్కెట్ రోడ్డు పక్కన ఒక భవనం ఉంది. పాతకాలం నాటి ఈ భవనంలో.. రోడ్డు వైపునకు ఒక మొబైల్ షాపు, రెండు పూల దుకాణాలు ఉన్నాయి. శ్రీరాముల గౌడ్ ఇంటి వెనకాల ఉన్న మరో నివాస గృహంలో అతడి చెల్లెలు తిరుపతమ్మ అనే 50 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం రాత్రి రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ భారీ శబ్ధంతో పేలింది. ఈప్రమాదంలో భవనంలో ఉన్న మూడు షాపులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అలానే బిల్డింగ్ శిథిలాలు చుట్టు పక్కల ప్రాంతాల్లోకి ఎగిరి పడ్డాయి.
ప్రమాదం జరిగిన సమయంలో ఓ వ్యక్తి భవనం సమీపం నుంచే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ప్రమాద ధాటికి ఎగిరి పడ్డ శిథిలాలు.. ఆ వ్యక్తికి తగిలి అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు అతడని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా.. దురదృష్టవాత్తు మార్గమధ్యలోనే చనిపోయాడు.
ఇదిలా ఉంటే.. భవన శకలాల్లో కూరుకుపోయిన తిరుపతమ్మకు ఒళ్లు కాలి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమెతో పాటు భవనం పక్కన ఉన్న స్టేషనరీ దుకాణంలో పని చేసే మరో వ్యక్తి కూడా తీవ్రగా గాయపడ్డాడు. అతడి చేయి విరిగిపోయిందని సమాచారం. అలానే మొబైల్ షాపులో పని చేసే వ్యక్తికి కూడా గాయాలయ్యాని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడి.. వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈప్రమాదంలో ఒకరు చనిపోగా.. ముగ్గురు గాయపడ్డారు. అయితే ఈ భవంన 50 ఏళ్ల నాటిదని అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.