|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 10:48 AM
ఒక్కసారిగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వడంతో నీట మునిగిన అమీర్పేట మెట్రో స్టేషన్ పరిసరాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ మంగళవారం పరిశీలించారు. సోమవారం సాయంత్రం భారీ వర్షానికి జూబ్లీహిల్స్, కృష్ణానగర్, యూసుఫ్ గూడ, ఎల్లారెడ్డి గూడ ప్రాంతాలతో పాటు, మధురానగర్, శ్రీనివాస్ నగర్ వెస్ట్ నుంచి భారీగా వరద రావడంతో రహదారిపై నీరు నిలిచిందని స్థానిక అధికారులు కమిషనర్ కు వివరించారు. 40 అడుగుల వెడల్పుతో పై నుంచి వచ్చిన వరద కాలువలు అమీర్పేట - సంజీవరెడ్డి నగర్ ప్రధాన రహదారి దాటే సమయంలో 10 అడుగులకు కుంచించుకుపోవడంతో ఈ సమస్య తలెత్తిందని చెప్పారు. అమీర్పేట మెట్రో స్టేషన్ కింద నిర్మించిన కల్వర్టులో వున్న పైపు లైన్లలో ఒకటి పూడికతో మూసుకుపోవడంతో సమస్య తీవ్రమైందన్నారు. వెంటనే పైపు లైన్లలో పూడికను తొలగించాలని కమిషనర్ సూచించారు. అప్పటికీ సామర్థ్యం సరిపోకపోతే పైన వాహన రాకపోకలకు ఆటంకం కలగకుండా టన్నెల్ మాదిరి పనులు చేపట్టి అదనంగా పైపులైన్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం లకడికాపూల్ ప్రాంతాలను పరిశీలించారు. లకడికాపూల్ చౌరస్తాలో పైపులైన్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కొత్తగా పైపులైన్లు వేస్తున్నప్పుడు బారికేడ్లను ఏర్పాటు చేయాలని.. లేని పక్షంలో ప్రయాణికులకు ప్రమాదకరంగా మారుతుందని సూచించారు. ఈ వర్షాకాలంలో వరద ముంచెత్తకుండా తక్షణ చర్యలతో ఉపశమనం లభించేలా, సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు