|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 04:32 PM
అదృష్టం ఏ రూపంలో వస్తుందో.. దురదృష్టం ఏ దారిలో పలకరిస్తుందో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు మట్టి పట్టుకున్నా బంగారమైపోతుంది. మరికొన్నిసార్లు తాడు అనుకుంటే అది పామై కాటేస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో జరిగిన ఒక ఘటన ఈ సామెతను మరోసారి నిజం చేసింది. 15 ఏళ్లుగా వస్త్ర వ్యాపారం చేస్తూ కష్టపడి జీవితాన్ని నిర్మించుకున్న శ్రీనివాస్ అనే వ్యాపారికి అనుకోని రీతిలో ఒక పాము రూపంలో దురదృష్టం వచ్చి పలకరించింది. 15 ఏళ్ల కలల్ని, కష్టాన్ని నిమిషాల్లో కాలి బూడిద చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.50 లక్షల నష్టాన్ని మిగిల్చింది. విద్యుత్ స్తంభంపై ఎక్కిన ఒక పాము కారణంగా షార్ట్‌సర్క్యూట్ జరగ్గా.. సమీపంలోని బట్టల దుకాణాన్ని బూడిద చేసింది.
వివరాల్లోకి వెళితే.. టేకుమట్ల మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ గత 15 ఏళ్లుగా వస్త్ర వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి తన దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్లారు. దురదృష్టవశాత్తు.. అదే రాత్రి దుకాణం సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభంపైకి ఒక నాగుపాము ఎక్కింది. ఆ పాము విద్యుత్ తీగలకు తగలడంతో షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. దీంతో క్షణాల్లో దుకాణంలో భారీగా మంటలు చెలరేగాయి. దుకాణం పైభాగంలో నివసిస్తున్న శ్రీనివాస్ మంటలను గమనించి, స్థానికుల సహాయంతో మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు.
కానీ, అప్పటికే మంటలు పూర్తిగా వ్యాపించడంతో అదుపులోకి రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేలోపే దుకాణంలోని వస్త్రాలు, ఫర్నిచర్, నగదు మొత్తం కాలి బూడిదయ్యాయి. ఈ దుర్ఘటనలో దుకాణ యజమాని శ్రీనివాస్ తన సర్వస్వాన్ని కోల్పోయారు. దాదాపు రూ.50 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ఈ ప్రమాదానికి కారణమైన ఆ పాము కూడా విద్యుత్ షాక్‌కు గురై స్తంభంపైనే మృతి చెందింది. కంటికి కనిపించని ఒక చిన్నపాటి ప్రమాదం, ఒక కుటుంబానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ సంఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, ఆర్థికంగా సాయం అందించాలని బాధితుడు శ్రీనివాస్ కోరుతున్నారు.