|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 07:37 PM
ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లోనే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. కానీ పాఠశాలలో తమ పిల్లలను చేర్చే ముందు ఆ పాఠశాలకు సరైన అనుమతులు ఉన్నాయా... నాణ్యమైన విద్య అందిస్తున్నారా అని చాలామంది తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. ఇదే అదనుగా కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా పాఠశాలలను నడుపుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లిలో ఓ పాఠశాల కూడా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చుంచుపల్లి తండాలో శ్రీ చైతన్య పాఠశాల గత మూడేళ్లుగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే కొనసాగుతోంది. విద్యాశాఖ అధికారులు ఇంతకాలం ఈ అక్రమ కార్యకలాపాలపై చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీ చైతన్య యాజమాన్యం, విద్యాశాఖ అధికారుల మధ్య ఏదైనా అవగాహన కుదిరిందా అని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఎట్టకేలకు.. నిబంధనల ఉల్లంఘనను గుర్తించిన అధికారులు బుధవారం ఆ పాఠశాలను సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
పాఠశాల సీజ్ చేసిన వెంటనే.. అధికారులు అక్కడి విద్యార్థులను ఇతర శ్రీ చైతన్య బ్రాంచ్‌కు తరలించారు. ఈ పరిణామంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని భయపడుతూ.. సిబ్బందిని నిలదీశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ఐఐటీ కోర్సులు, అంతర్జాతీయ ప్రమాణాల విద్య వంటి మాయమాటలు చెప్పి తల్లిదండ్రులను ఆకట్టుకుంటునే ప్రయత్నం చేస్తాయి. వేలకు వేలు ఫీజులు చెల్లించి తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నమ్మే తల్లిదండ్రులు.. ఆ పాఠశాలకు కనీస అనుమతులు ఉన్నాయా లేదా అని తెలుసుకోకపోవడం వల్ల ఇలాంటి మోసాలకు గురవుతున్నారు.
శ్రీ చైతన్య యాజమాన్యం తమను ఇంత మోసం చేస్తుందని ఊహించలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. అధికారులు తమ అలసత్వాన్ని విడిచిపెట్టి.. అక్రమ పాఠశాలలపై ముందుగానే చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారకుండా, ప్రభుత్వం ఇలాంటి అక్రమ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ విద్యాసంస్థల మాయమాటలను నమ్మకుండా.. వాటి అనుమతులు, ఉపాధ్యాయుల అర్హతలను తనిఖీ చేసుకున్న తర్వాతే తమ పిల్లలను చేర్చాలని అధికారులు సూచిస్తున్నారు.