|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 02:24 PM
సోమవారం ఉదయం జరిగిన 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్ లో, అదే రోజు సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను నిర్మాత రత్నంతో పాటు పవన్ కళ్యాణ్ సైతం క్రిష్ సేవలను పొగిడారు. ఈ సినిమా రూపకల్పనలో క్రిష్ కృషి ఎంతో ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం క్రిష్ సోషల్ మీడియా వేదికగా తన మనసులోని భావాలను పంచుకుంటూ, ఈ నెల 24, గురువారం జనం ముందుకు రాబోతున్న 'హరిహర వీరమల్లు' సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు లెజెండ్స్ కారణంగా ఇవాళ 'హరిహర వీరమల్లు' అనే సినిమా జనం ముందుకొస్తోందని చెప్పారు. పవన్ కళ్యాణ్ లోని ఫైర్ ను ఏ కెమెరా కాప్చర్ చేయలేదని కితాబిస్తూ... ఈ సినిమాకు వెన్నెముక, ఆత్మ పవన్ కళ్యాణే అన్నారు. అలానే సినిమా రంగంలో సుదీర్ఘ అనుభవం కలిసిన ఎ. ఎం. రత్నం వల్లనే 'హరిహర వీరమల్లు' ఇంత గ్రాండియర్ గా రూపుదిద్దుకుందని తెలిపారు. ఈ సినిమా తన మనసుకు ఎంతో దగ్గరైనదని అంటూ, ఓ దర్శకుడిగానే కాకుండా మరచిపోయిన చరిత్రను అన్వేషించి ప్రేక్షకుల ముందు ఉంచాలనుకున్న వ్యక్తిగా ఎంతో ఆనంద పడుతున్నానని చెప్పారు. 'హరి హర వీరమల్లు' విడుదల వేళ క్రిష్ తెలిపిన ఈ సందేశం పవన్ అభిమానులలో నూతనోత్తేజాన్ని నింపడం ఖాయం. ఇదిలా ఉంటే ప్రస్తుతం క్రిష్ 'ఘాటీ' అనే చిత్రాన్ని అనుష్క నాయికగా తెరకెక్కిస్తున్నారు. అది కూడా అతి త్వరలోనే జనం ముందుకు రానుంది.
Latest News