|
|
by Suryaa Desk | Sun, Jul 27, 2025, 09:03 PM
ఓటీటీ ఆడియెన్స్ నుండి ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. ప్రేక్షకుల అభిరుచిని గమనిస్తున్న ఓటీటీ సంస్థలు, వారి కోసం ప్రత్యేకమైన కంటెంట్‌ను అందించేందుకు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పుడు మనం చర్చించబోయేది ఒక ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గురించి.ఈ కథ 1998లో జరిగిన ఒక వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించబడింది. రేపల్లె అనే గ్రామంలో వరుసగా యువతులు మాయమవుతూ ఉండటంతో ఊరిలో అలజడి మొదలవుతుంది. ముఖ్యంగా రాత్రి పూట అడవి దారి వెంబడి వెళ్లిన యువతులు అదృశ్యమవుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమవుతారు. గ్రామంలో రాత్రివేళ అడవిలోకి ఎవరూ వెళ్లకూడదని అధికారికంగా హెచ్చరికలు జారీ చేస్తారు.అప్పట్లో ఆ గ్రామ పోలీస్ స్టేషన్‌లో కొత్తగా విధుల్లో చేరుతుంది కానిస్టేబుల్ కనకం. ఆమె ఈ మిస్సింగ్ కేసును ఛాలెంజ్‌గా తీసుకుంటుంది. దర్యాప్తులో భాగంగా ఓదార్చలేని నిజాలు బయటపడతాయి. మరి అమ్మాయిల అదృశ్యానికి వెనక మిస్టరీ ఏమిటి? కనకం ఈ కేసును ఎలా చేధించింది? ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుంది.వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ పేరు "కానిస్టేబుల్ కనకం". దీనికి దర్శకత్వం వహించిన వ్యక్తి ప్రశాంత్ కుమార్ కాగా, కోవెలమూడి సత్యసాయిబాబా మరియు వేటూరి హేమంత్ కుమార్ ఈ సిరీస్‌ను సంయుక్తంగా నిర్మించారు. అవసరాల శ్రీనివాస్, రాజీవ్ కనకాల వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపాయి. తాజాగా, ఈ సిరీస్‌కు సంబంధించి స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 14 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ కాబోతోంది.
"నిత్యం మనం చూసే పోలీస్ కాదు… సాధారణ కేసు అయితే అసలు కాదు… కానిస్టేబుల్ కనకం వస్తోంది… అన్నింటినీ షేక్ చేయడానికి!" అంటూ తాజా పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.