|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 02:11 PM
ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్ పెళ్ళి ఓ ప్రహసనంగా మారిపోయింది. గత కొన్నేళ్ళుగా అతని వివాహానికి సంబంధించి చర్చోపచర్చలు జరుగు తున్నాయి కానీ కళ్యాణ ఘడియలు మాత్రం రాలేదు. తాజాగా నటి సాయి ధన్సిక మెడలో ఆగస్ట్ 29న విశాల్ మూడు ముడులు వేయాల్సి ఉండగా, అది కూడా వాయిదా పడిందని తెలుస్తోంది.మొదట్లో నటుడు విశాల్, శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి ప్రేమాయణం సాగిస్తున్నారంటూ కోలీవుడ్ లో విపరీతంగా వార్తలు వచ్చాయి. అయితే వరలక్ష్మీ తన స్నేహితురాలు తప్పితే, తమ మధ్య ప్రేమ, పెళ్ళివంటివి లేవని విశాల్ చెప్పాడు. వరలక్ష్మీ సైతం అదే మాట అనేకసార్లు చెప్పింది. పైగా వరలక్ష్మీ తండ్రి శరత్ కుమార్ పై నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో విశాల్ విరుచుకు పడ్డాడు. ఆయనకు పోటీగా వేరే ప్యానల్ పెట్టి తన సత్తాను చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో విశాల్, వరలక్ష్మీ పెళ్ళి జరగడం అనేది అసాధ్యమని అందరూ అనుకున్నారు. చివరకు అదే జరిగింది. వరలక్ష్మీ శరత్ కుమార్ హ్యాపీగా ప్రేమ పెళ్ళి చేసేసుకుంది.ఇక విశాల్ భగ్న ప్రేమికుడిగా జీవితాన్ని వెళ్ళదీస్తాడా? అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్న టైమ్ లో 2019లో అతను హైదరాబాద్ కు చెందిన అనీషా అల్లారెడ్డితో వివాహ నిశ్చితార్థం జరుపుకున్నాడు. కానీ తెర వెనుక ఏం జరిగిందో తెలియదు కానీ కొద్ది నెలలకే ఇది కాస్తా కాన్సిల్ అయిపోయింది. ఇలాంటి సమయంలో నడిగర్ సంఘం కొత్త భవన నిర్మాణం జరిగిన తర్వాతే తాను పెళ్ళి చేసుకుంటానని విశాల్ మరోసారి శపథం చేశాడు. అది ఎప్పుడు పూర్తవుతుందో, విశాల్ ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాడో అని ఎదురుచూస్తున్న తరుణంలో కొద్ది రోజుల ముందు నటి సాయి ధన్సిక తాను ప్రేమలో ఉన్నామని, ఆగస్ట్ 29న తమ పెళ్ళి జరుగుతుందని తెలిపాడు. సాయిధన్సిక కూడా ఈ వార్తను ఖరారు చేసింది.కానీ ఇప్పుడు విశాల్, సాయి ధన్సిక వివాహం ఆగస్ట్ 29న జరగడం లేదని తెలుస్తోంది. పదేళ్ళ క్రితం విశాల్ నడిగర్ సంఘం సొంత భవన నిర్మాణం పూర్తయ్యాకే తన పెళ్ళి అని చెప్పిన విశాల్... దానికి కట్టుబడే ఈ పెళ్ళిని వాయిదా వేశాడట. ప్రస్తుతం ఈ బిల్డింగ్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఇందులో మొదటి రెండు అంతస్తులను కార్యాలయం కోసం ఉపయోగించి, మూడో అంతస్తులో పెళ్ళి మందిరాన్ని నిర్మిస్తున్నారు. సో... అది పూర్తి కాగానే అందులోనే తాను పెళ్ళి చేసుకుంటానని, అందుకోసం మరికొన్ని రోజులు వేచి ఉండక తప్పదని విశాల్ చెబుతున్నాడు. ఆ కళ్యాణ మండపంలో జరిగే తొలి వివాహం తనదే అని అంటున్నాడు. సో... ఆ మధ్య చెప్పినట్టుగా ఆగస్ట్ 29న విశాల్, సాయి ధన్సిక పెళ్ళి జరగడం లేదు.మరి విశాల్ తన పెళ్ళి కొత్త ముహూర్తాన్ని ఎప్పుడు చెబుతాడా? అని అభిమానులు ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఆగస్ట్ 29న విశాల్... ఆ కొత్త తేదీని ప్రకటిస్తాడని సన్నిహితులు అంటున్నారు. మొత్తం మీద కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విశాల్ పెళ్ళి పీటలు ఎక్కడానికి మరింత సమయం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Latest News