|
|
by Suryaa Desk | Sat, Jul 26, 2025, 08:14 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ చిత్రం 'అతడు' రీ-రిలీజ్‌కు సిద్ధమైంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న 4K టెక్నాలజీతో ఈ సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జయభేరి ఆర్ట్స్ బ్యానర్ అధినేత మురళీ మోహన్ శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కీలక విషయాలు వెల్లడించారు.
"మా బ్యానర్‌లో తీసిన చిత్రాలన్నీ ఒకెత్తు.. 'అతడు' ఇంకో ఎత్తు" అని మురళీ మోహన్ పేర్కొన్నారు. 2005 ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు సాంకేతికంగా అప్‌గ్రేడ్ చేసి మళ్లీ రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. రచయితగా మంచి సక్సెస్ లో ఉన్న త్రివిక్రమ్‌ను తమ బ్యానర్‌లో దర్శకుడిగా పరిచయం చేయాలనుకున్నామని, మూడు గంటల పాటు 'అతడు' కథను కళ్ళకు కట్టినట్టు చెప్పారని గుర్తు చేసుకున్నారు. "హీరో పాత్ర కాస్త నెగెటివ్ ధోరణిలో ఉంది కదా? అని అడిగితే, ఇప్పుడు అదే ట్రెండ్ అని త్రివిక్రమ్ అన్నారు. ఆయనపై భారం వేశాం" అని వివరించారు.
సినిమా కోసం వేసిన ఇంటి సెట్ అద్భుతంగా ఉందని ప్రశంసలు అందుకుందని, దాదాపు 90 శాతం షూటింగ్ అక్కడే జరిగిందని చెప్పారు. మహేష్ బాబు షూటింగ్ కోసం ఎంత ఆలస్యమైనా, ఎన్ని డేట్లు అడిగినా సహకరించారని, క్లైమాక్స్ ఫైట్ కోసం చాలా కష్టపడ్డారని కొనియాడారు. థియేట్రికల్‌గా ఆశించినంత ఆడకపోయినా, బుల్లితెరపై 'అతడు' కొత్త చరిత్రను సృష్టించి, తమ సంస్థకు మంచి గౌరవాన్ని తెచ్చిందని మురళీ మోహన్ అన్నారు.తన సోదరుడు కిషోర్ తనయ ప్రియాంక ఈ మూవీని టెక్నికల్‌గా అప్‌గ్రేడ్ చేసి 8K, సూపర్ 4Kలోకి మార్చారని, డాల్బీ సౌండ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని తెలిపారు. ఇక ముందు ప్రియాంక ఆధ్వర్యంలో జయభేరి ఆర్ట్స్ నుంచి సినిమాలు వస్తూనే ఉంటాయని చెప్పారు. రీ-రిలీజ్‌కు వస్తున్న క్రేజ్ చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.మహేష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధి అన్వేష్ మాట్లాడుతూ.. రీ-రిలీజ్‌ల ద్వారా వచ్చే డబ్బును ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకే వాడుతున్నామని స్పష్టం చేశారు. జయభేరి ఆర్ట్స్ ప్రతినిధి ప్రియాంక దుగ్గిరాల, ఎక్సెల్ బ్యానర్ ప్రతినిధి జితేంద్ర గుండపనేని కూడా రీ-రిలీజ్ విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు.
Latest News