|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 02:07 PM
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'హరి హర వీరమల్లు' ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. పవన్ కు తొలి పాన్ ఇండియా సినిమా ఇది. మొత్తం 5 భాషల్లో ఈ సినిమాను నిర్మించారు. ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను 50 శాతం పూర్తి చేసి... ఆ తర్వాత ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత మిగిలిన సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. మరో రెండు రోజుల్లో సినిమా విడుదల కాబోతున్న తరుణంలో... సోషల్ మీడియా వేదికగా క్రిష్ స్పందించారు. 'హరి హర వీరమల్లు' సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమయిందని క్రిష్ అన్నారు. 'నిశ్శబ్దంగా కాదు... ఒక బలమైన సంకల్పంతో' రాబోతోందని చెప్పారు. సినిమాలోనే కాదు, ఆత్మలోనూ పవన్ కల్యాణ్ ఒక అసాధారణమైన శక్తి అని కొనియాడారు. ఆయన నిత్యం మండే స్ఫూర్తి అని అన్నారు. ఈ సినిమాకు ఆయనే ఆత్మ, వెన్నెముక అని చెప్పారు. నిర్మాత ఏఎం రత్నం ఒక గొప్ప శిల్పి అని, ఎన్ని కఠిన పరిస్థితులు ఎదురైనా తట్టుకోగల ధైర్యం ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు. ఆయన గొప్ప సంకల్పం అందరికీ స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. వ్యక్తిగతంగా ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమని అన్నారు. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నానని చెప్పారు.
Latest News