|
|
by Suryaa Desk | Sat, Apr 25, 2026, 12:52 PM
చెరువులను ఎంతో వ్యయప్రయాశలతో పునరుద్ధరిస్తున్నాం. చెరువులు పూర్తయ్యే సరికి ఎస్‌టీపీ (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)లు కూడా సిద్ధమవ్వాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు అధికారులను ఆదేశించారు. అప్పుడే చెరువుల పునరుద్ధరణ ప్రయోజనం ఉంటుందని అన్నారు. రెండోవిడత చేపట్టిన 14 చెరువుల పునరుద్ధరణలో భాగంగా.. రాజేంద్రనగర్ మండలం, ఇబ్రహీంబాగ్‌లోని ఇబ్రహీంబాగ్ చెరువును గురువారం హైడ్రా కమిషనర్ సందర్శించారు. పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. పూడిక ఏమాత్రం లేకుండా తొలగించాలని సూచించారు. అప్పుడే చెరువుల దుర్గంధం వదులుతుందని.. అలాగే.. చెరువు పరిసరాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. చెరువుల పునరుద్ధరణ జరిగిన సమయానికి ఎస్టీపీలు సిద్ధం కాకపోతే మళ్లీ మురుగు నీరు చేరి జలాలు కలుషితమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. ఎస్‌టీపీల పనులను పర్యవేక్షిస్తున్న జలమండలి అధికారులతో మాట్లాడారు. చెరువు పై భాగంలో ఎస్‌టీపీల నిర్మాణంలో ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తామని.. పనులు వేగవంతం చేయాలని సూచించారు. 56 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఎస్‌టీపీలను నిర్మిస్తున్నట్టు జలమండలి అధికారులు కమిషనర్‌కు తెలిపారు. ఎస్‌టీపీల నుంచి వచ్చిన నీటిని కూడా ముందుగా సెడిమెంటేషన్ పాండ్‌లోకి తరలించి.. అక్కడినుంచి ప్రధాన చెరువులోకి చేరేలా చూడాలన్నారు.
ఇబ్రహీం చెరువు దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వచ్చిన ఆక్రమణలను ఇప్పటికే హైడ్రా తొలగించింది. ఆయా ప్రాంతాలను చెరువు అభివృద్ధి పరిధిలోకి తీసుకు రావాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు సూచించారు. ఇన్‌లెట్లు, ఔట్‌లెట్ల నిర్మాణంలో శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. వరద పెద్దమొత్తంలో వచ్చినప్పుడే చెరువులోకి నీరు చేరేలా.. మిగతా సమయంలో మురుగు నీరు కిందకు పోయేలా ఏర్పాట్లు చూడాలని సూచించారు. ఇప్పటికే అభివృద్ధి చేసిన చెరువుల మాదిరే చుట్టూ పాత్‌వే ఉండాలని, అన్ని వయసుల వారు సేదదీరేలా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. 29.53 చదరపు కిలోమీటర్ల నుంచి వరద నీరు చెరువుకు వచ్చి చేరుతుందని.. ఈ చెరువు నిండిన తర్వాత ఆ నీరు నేరుగా మూసీలో కలుస్తుదని కమిషనర్ చెప్పారు. అంతకు ముందు జలసంరక్షణకు పాటు పడుతున్న సాహే (సొసైటీ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్), ది రైన్ వాటర్ ప్రాజెక్టు సంస్థలు కొండాపూర్‌లో అభివృద్ధి చేసిన కుడికుంట చెరువును కూడా హైడ్రా కమిషనర్ సందర్శించారు. చెరువు పరిధిలోకి వచ్చే 275 గజాల స్థలాన్ని పరిరక్షించాలని ది రైన్ వాటర్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు కల్పనా రమేష్ గారు కోరారు. చెరువు పరిధిలోకి వచ్చే స్థలాలను కూడా కాపాడితే.. పార్కుల అభివృద్ధితో పాటు.. అన్ని వయసులవారు సేద దీరేలా అభివృద్ధి చేయవచ్చునని కోరారు. త్వరలోనే విచారించి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ తెలిపారు. ఆదాయ వనరుగా చెరువును మార్చడంలో కల్పనారమేష్ గారు చూపిన చొరవను హైడ్రా కమిషనర్ అభినందించారు.