|
|
by Suryaa Desk | Mon, Apr 20, 2026, 03:09 PM
లండన్ పర్యటనలో ఉన్న మాజీ ఎంపీ మరియు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ఎన్నారై బీఆర్ఎస్ యూకే మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎన్నారైల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.తెలంగాణ ఉద్యమ సమయం నుండి నేటి వరకు గులాబీ జెండా పట్టుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేస్తూ పార్టీకి, ప్రజలకు ఎన్నో సేవలందిస్తున్న ఎన్నారైల పాత్ర గొప్పదని సంతోష్ కుమార్ ఎన్నారైలను అభినందించారు.గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని, అదే సమయంలో వారికి స్ఫూర్తినిచ్చిన కేసీఆర్ గారికి మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని భాగస్వాములైన అందరికీ కృతఙ్ఞతలు తెలిపారు.తాను బతికి ఉన్నంత వరకు తన వంతుగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తానని, ప్రతీ ఒక్కరు రాబోయే తరాలకు మనం మన భూమిని పర్యావరణాన్ని సురక్షితంగా ఆరోగ్యవంతంగా ఉంచేలా పని చేసి బాధ్యతతో ఉండాలని పిలుపునిచ్చారు.ముఖ్యంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే పై కేసీఆర్ గారికి, పార్టీ నాయకత్వానికి ప్రత్యేక అభిమానమని ఉద్యమం నుండి పార్టీకి అండగా నిలిచారని, తెలంగాణ కు కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష అని రానున్న రోజుల్లో మనమంతా మళ్ళీ కష్టపడి పని చేసి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు ప్రజల పక్షాన పోరాటం చెయ్యాలని తెలిపారు.
అన్ని సందర్భాల్లో మొక్కలు నాటుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంటున్న ఎన్నారైలకు సంతోష్ కృతఙతలు తెలిపారు.ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, FDC మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ... కేసీఆర్ గారికి మరియు పార్టీ నాయకులకు సమన్వయం చేస్తూ దాదాపు 26 సంవత్సరాలుగా వారి వెంటే ఉంటూ వారిని ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా, ప్రత్యేకంగా ఎన్నారై బీఆర్ఎస్ ఆవిర్భావం నుండి నేటి వరకు ఎంతో ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న సంతోష్ కుమార్ గారికి ఎన్నారైల పక్షాన కృతఙ్ఞతలు తెలిపారు. మేమంతా ఎప్పటికీ కేసీఆర్ గారి వెంటే ఉంటామని, ఎప్పటిలాగే అటు సోషల్ మీడియాలో మరియు ప్రత్యక్ష నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు.
గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు పొందినందుకు మాకందరికీ గర్వంగా ఉందని వారికి శుభాకాంక్షలు తెలిపి, రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు ప్రశంసలు పొందాలని ఆకాక్షించారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ..
ఎన్నారై బీఆర్ఎస్ యూకే పదహారు సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలని సభకు వివరించారు. కేసీఆర్ గారి సంక్షేమ పాలన నుండి ప్రస్తుతం కాంగ్రెస్ రాక్షస పాలనలో పడ్డామని కాబట్టి మళ్ళీ మరో ఉద్యమం చేసి తెలంగాణ ప్రజలను కాపాడుకొని కేసీఆర్ గారి రామ రాజ్యం తెచ్చుకోవాలని, దాని కోసం మనమంతా కష్టపడి పని చేద్దామని పిలుపునిచ్చారు.
సంతోష్ గారి ఆధరణ అభిమానం సమన్వయం ఇలాగే ఉండాలని రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని, సమయమిచ్చి హాజరైనందున కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు FDC మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.