|
|
by Suryaa Desk | Mon, Apr 06, 2026, 11:33 AM
తెలంగాణ ప్లాట్‌ఫాం ఆధారిత గిగ్ వర్కర్ల (రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత మరియు సంక్షేమం) బిల్లు-2026ను శాసనసభ ఆమోదించింది. సోమవారం అసెంబ్లీలో ఈ బిల్లును కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖల మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బిల్లులోని ముఖ్యాంశాలను వివరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, సంజీవరెడ్డి, హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంఐఎం సభ్యులు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, బీజేపీ సభ్యులు పాల్వాయి హరీశ్, సీపీఐ శాసనస భాపక్షనేత కూనంనేని సాంబశివరావు తదితరులు దీనిపై మాట్లాడారు. కొందరు సభ్యులు బిల్లులోని అంశాల్లో మరిన్ని వివరాలను కోరారు.మరికొందరు సభ్యులు ఈ బిల్లు ఆవశ్య కతను వివరిస్తూ, స్వాగతించారు. కూనంనేని సాంబ శివరావు మాట్లాడుతూ గిగ్ వర్కర్లతో పాటు అసంఘటితరంగంలో ఉన్న దాదాపు 2 కోట్ల మంది కార్మికులం దర్నీ పీఎఫ్, ఈఎస్‌ఐ పరిధిలోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగి, యజమాని, ప్రభుత్వ భాగస్వామ్యాలతో రిటైర్‌మెంట్ తర్వాత వారికి పెన్షన్ సౌకర్యం కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. జర్నలిస్టుల జీవితాలు గిగ్ వర్కర్ల కంటే మెరుగ్గా ఏమాత్రం లేవన్నారు. కనీస వేతనాలు ఇవ్వట్లేదని చెప్పారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి సభ్యులు లేవనెత్తిన సందేహాలకు సమాధానాలు చెప్పారు. బిల్లులోని ప్రధానాంశాలను వివరించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో గిగ్ పర్కర్లకు చట్టబద్ద గుర్తింపు ఇవ్వడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకొచ్చామన్నారు. వర్కర్ల హక్కులు, గౌరవం, జీవనోపాదిని కాపాడే విధంగా నిబంధనలు రూపొందించామనీ, ఈ బిల్లు అమల్లోకి వచ్చాక ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం సంస్థలు క్రమం తప్పకుండా వివరాలు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు.