|
|
by Suryaa Desk | Tue, Mar 31, 2026, 12:52 PM
కాలనీల్లో రహదారులను కబ్జా చేసేస్తున్నారు. డెడ్ ఎండ్ కాలనీ రోడ్డుంటే.. ఇరువైపులా ప్లాట్లున్నవారు ఆ దారినే మూసేస్తున్నారు. కొత్తగా పక్కన లే ఔట్‌లు వేసిన వారు.. ఇప్పటికే ఉన్న వరద, మురుగు కాలువలకు ఆటంకాలు సృష్టిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ మండలం కుంట్లూరు విలేజ్ సర్వే నంబరు 204లో దాదాపు 15 ఎకరాల మేర 800ల ప్లాట్లతో అంజానాద్రినగర్ పేరిట లే ఔట్ వేశారు. పక్కనే లే ఔట్ వేసిన వారు తమ లే ఔట్లోకి జరిగి రహదారితో పాటు.. కొన్ని ప్లాట్లు మాయం చేశారంటూ అంజనాద్రి ప్లాట్ యజమానులు ఫిర్యాదు చేశారు. తుర్కయాంజల్ నాగార్జున సాగర్ రోడ్డుకు ఆనుకుని ఉన్న మన్నెగూడ విలేజ్‌లో 30 పీట్ల రహదారిని ఆక్రమించారని.. రోడ్డు మీద ట్రాన్స్‌ఫార్మర్, గుడికి చెందిన ప్రహరీ నిర్మించారని ప్రజావాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ప్లాట్లకు ఎల్ ఆర్ ఎస్ కూడా వచ్చిందని.. అందులో రోడ్డు కూడా ఉందని.. ఇప్పుడు కావాలంటే రోడ్డును కొనుక్కోవాలని అక్కడివారు చెబుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. హయత్‌నగర్ మండలం వనస్థలి పురం సాహేబ్‌నగర్ కలాన్‌లోని మహలక్ష్మీనగర్ కాలనీ పక్కన కమర్షియల్ లేఔట్ వేసిన వారు మురుగుతో పాటు వరద కాలువను మూసేయడంతో తమ ప్రాంతం నీట మునుగుతోందని ఫిర్యాదు చేశారు. పటాన్‌చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ పక్కన ప్రవీన్స్ లగ్జారియాలో సెంట్రల్ పార్కులో ఆలయాల పేరిట కబ్జా చేస్తున్నారని.. వెంటనే నిలువరించాలని హైడ్రా ప్రజావాణిలో వాపోయారు. నాచారం - మల్లాపూర్ ప్రధాన రహదారిలో ఆక్రమణలు జరుగుతున్నాయని.. రోడ్డు మీదకు వచ్చి నిర్మాణాలు చేపడుతున్నారని, రాజేంద్రనగర్ జోన్ అత్తాపూర్ సర్కిల్, మైలార్‌దేవుపల్లిలోని టీఎన్‌జీవో కాలనీలో 1200ల గజాల పార్కును కబ్జా చేశారని ఫిర్యాదులందాయి. ఇదే కాలనీలో 40 ఫీట్ల రహదారిని కూడా కబ్జా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్ గ్రామంలో పత్తికుంటకు వెళ్లే వరద కాలువను కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు అందింది. ఇలా హైడ్రా ప్రజావాణికి మొత్తం 58 ఫిర్యాదులందగా.. వాటిని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పరిశీలించి.. పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.