|
|
by Suryaa Desk | Tue, Mar 17, 2026, 12:12 PM
ప్లాట్, ఇంటి స్థలం కొనేటప్పడు లోతుగా విచారించి.. అన్నీ సరిగా ఉంటేనే ముందుకు వెళ్లాలని హైడ్రా సూచించింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఏమైనా ఉన్నాయా..? అనుమతి పొందిన లే ఔటా.. కాదా..? ఇంటి నంబరు చూపించి ప్లాట్లను, బై నంబర్లతో ప్లాట్లను అమ్ముతున్నప్పుడు మరింత అప్రమత్తంగా పరిశీలించి కొనుక్కోవాలని పేర్కొంది. గేటెడ్ కమ్యూనిటీ అంటూ ప్లాట్లు, విల్లాలు అమ్ముతున్నప్పుడు ఆ అనుమతులను పరిశీలించాలని కోరింది. గేటెడ్ కమ్యూనిటీ అయితే తన సొంత స్థలంలోంచి చుట్టుపక్కల కాలనీలకు కనీసం 40 అడుగుల దారి చూపించారా లేదా అనేది పరిశీలించి కొనాలంది. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా ఈ హెచ్చరికలు చేసింది. సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు రాగా వాటిని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు వాటిని పరిశీలించారు. ఫిర్యాదు దారుల ముందే గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ ఇమేజీల ఆధారంగా పరిశీలించి.. పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం, పాటి విలేజ్‌లోని సర్వే నంబరు 184 నుంచి 187తో పాటు పలు సర్వే నంబర్లలో మొత్తం 92 ఎకరాల పరిధిలో 1100ల ప్లాట్లతో ఆనందనగర్ కాలనీ పేరుతో లే ఔట్ వేశారు. ఇందులో కొన్ని ఎల్ ఆర్ ఎస్ కూడా అయ్యాయి. 1980 గ్రామ పంచాయతీ లే ఔట్ అయ్యింది కాని మ్యూటేషన్ కాలేదు. తర్వాత వారసులతో పాటు.. గతంలో భూమిని అమ్మిన రైతులు కొత్తగా పాస్ పుస్తకాలు సృష్టించి వేరేవాళ్లకు అమ్మడం చేశారు. ఇలా 92 ఎకరాల లే ఔట్‌లో దాదాపు 32 ఎకరాల వరకూ ఉన్న భూమి వివాదంలోకి మారింది. ఇదే విషయాన్ని హైడ్రా ప్రజావాణిలో పలువురు ప్లాట్ యజమానులు ఫిర్యాదు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో తమ ప్లాట్లను కబ్జా చేసి మరో లే ఔట్ వేసి అమ్మేయాలని చూస్తున్నారని బాధితులు వాపోయారు. ఇప్పటికే ఎల్ ఆర్ ఎస్ కూడా కొన్ని ప్లాట్లు అవ్వడంతో పాటు.. లే ఔట్‌ను పరిశీలించి న్యాయం చేస్తామని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు హామీ ఇవ్వడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి దగ్గర కాకతీయనగర్ కాలనీకి ఆనుకుని ఉన్న బాచుపల్లి చెరువులో మురుగునీరు వచ్చి చేరుతోంది. దీంతో దోమలు బాగా వ్యాపిస్తున్నాయి. ఈ చెరువులోకి మురుగు నీరు కలవకుండా కాలువను డైవర్ట్ చేయడంతో పాటు.. ఈ చెరువును కూడా అభివృద్ధి చేస్తే చుట్టూ ఉన్న వందలాది కాలనీలకు ఎంతో ఉపశమనంగా ఉంటుందని హరిహర హాల్‌మార్కు కల్చరల్ అసోసియేషన్ వారుల హైడ్రా ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు.
సంగారెడ్డి అమీన్‌పూర్ చెరువులో తమ లే ఔట్ మునిగిపోయిందని.. చెరువులోంచి నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వరుసగా చాలా లే ఔట్‌లు గంగలో కలిసిపోయాయని సెక్రటేరియట్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో వాపోయారు. చెరువు ఎప్‌టీఎల్ ను నిర్ధారించి తమ లే ఔట్‌లు మునగకుండా చూడాలని.. తప్పనిసరి పరిస్థితి ఉంటే వెంటనే తగిన విధంగా నష్ట పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా ఈ సమస్యకు పరిష్కారం లభించక ప్లాట్లు కొన్న సామాన్యులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.
❇️ మేడ్చల్ జిల్లా కాప్రామండలంలోని జీఆర్ రెడ్డి నగర్ హెచ్ ఎండీఏ లే ఔట్. ఆ లే ఔట్‌లో మొ్తం 4 పార్కులుండగా.. ఒక పార్కులో ఒకదాని తర్వాత ఒకటిగా దేవాలయాలు వచ్చేస్తున్నాయని.. అక్కడి నివాసితులు వాపోయారు. మొత్తం 197వరకూ ఉన్న ప్లాట్ల నివాసితులకు వినియోగంలో ఉండాల్సిన పార్కు స్థలంలో గుడులు నిర్మించడం.. ఈ తతంగం వెను కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులుండడం బాధాకరమని పేర్కొన్నారు. లే ఔట్ ప్రకారం పార్కుఉండేలా చూడాలని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
❇️ మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా బాలానగర్, శోభనా కాలనీలోని అక్షయ ఎన్‌క్లేవ్ పేరిట 7.12 ఎకరాల్లో 69 ప్లాట్లతో 1983లో లే ఔట్ వేశారు. ఇందులో రెండు స్థలాలను పార్కులకోసం కేటాయించారు. 1700ల గజాల పార్కును కబ్జా చేసేందుకు స్థానికులు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 200ల గజాలు ఆక్రమించి షెడ్డు వేసి వ్యాపారాలు చేస్తున్నారు. వెంటనే హైడ్రా స్పందించి చర్యలు తీసుకోవాలని.. పార్కును కాపాడాలని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.