|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 04:53 PM
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలానికి చెందిన ఓ అబ్బాయి నాగర్ కర్నూల్‌లోని ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. తనతోపాటు చదువుతున్న ముగ్గురు అమ్మాయిలను ప్రేమ పేరిట లోబర్చుకున్న ఆ అబ్బాయి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా వారితో చనువుగా మెలుగుతున్న సమయంలో మొబైల్ ఫోన్లో వీడియోలు తీశాడు.
డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని.. మీ ఇంట్లో వాళ్లకు పంపిస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. అతడి వేధింపులు భరించలేక ఓ అమ్మాయి జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పుకొని భోరుమంది. దీంతో బాలిక తరఫు వారంతా కలిసి ఆ పిల్లాడిని పట్టుకొని నాలుగు తగిలించి, అతడి నుంచి ఫోన్ లాగేసుకున్నారు. అనంతరం అతణ్ని పోలీసులకు అప్పగించారు.
ఈ క్రమంలోనే.. ఆ కుర్రాడి చేతిలో అత్యాచారానికి గురైన ఒక విద్యార్థిని గర్భం దాల్చిన విషయం బయటకొచ్చింది. ఆ బాలికను తను కొల్లాపూర్‌లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి అబార్షన్ చేయించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆ హాస్పిటల్‌కు వెళ్లి రికార్డులు పరిశీలించి స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేశారు. అనంతరం హాస్పిటల్‌కు చెందిన ఇద్దరు డాక్టర్లు, ఒక నర్సును అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు విద్యార్థినులపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటర్ స్టూడెంట్ మైనర్ కావడంతో, అతణ్ని జువైనల్ హోంమ్‌కు తరలించారు.
ఆ పిల్లాడు మైనర్ కావడంతో జువైనల్ జస్టిస్ బోర్డు ముందు అతణ్ని ప్రవేశపెడతారు. అత్యాచారం ఆరోపణలు రుజువైతై క్రూర నేరంగా పరిగణించిన పక్షంలో అతడికి కఠిన శిక్ష విధించే అవకాశం ఉంది. మైనర్ అమ్మాయి గర్భం దాల్చితే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకుండా, డబ్బులకు ఆశపడి గుట్టుచప్పుడు కాకుండా, తల్లిదండ్రుల అనుమతి లేకుండా అబార్షన్ చేసినందుకు డాక్టర్లు, నర్సు కూడా జైలుశిక్షను అనుభవించాల్సిన పరిస్థితి.