|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 12:32 PM
కనుమరగైపోయిన చెరువుల జాడ తెలుసుకోవడంతో పాటు.. ఉన్న వాటి ఎఫ్‌టీఎల్ లెక్కలు తేల్చడానికి ఎన్ ఆర్ ఎస్ సీ (NRSC )అందిస్తున్న ఉపగ్రహ ఆధారిత డేటా HYDRAAకు “వజ్రాయుధం” లా మారిందని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు అన్నారు. చెరువులు, నాలాల ఎఫ్‌టీఎల్, బఫర్ పరిధిలకు సంబంధించిన సమాచారం ఒక్కో విధంగా ఉందని.. ఇలాంటి సమయంలో ఎన్ ఆర్ ఎస్ సీ డేటా దిక్సూచీలా మారిందన్నారు. వికసిత్ భారత్ @ 2047 సాధనలో భూమి పరిశీలన విధానాలు - ధోరణులు, సవాళ్లు అనే అంశంపై ఎన్ ఆర్ ఎస్ సీ సెంటర్లో శుక్రవారం జరిగిన సదస్సులో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు. చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణలోనే కాదు.. ప్రబుత్వ భూములు, పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల లెక్క తేల్చడంలో కూడా ఎన్ ఆర్ ఎస్ సీ డేటా హైడ్రాకు ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి వందలాది మంది వస్తుంటారని.. వారి ఫిర్యాదులను అక్కడికక్కడే పరిశీలించడానికి కూడా ఈ డేటా వాడుతున్నామన్నారు. ఎప్పుడు ఎలా భూ వినియోగం మారిందో ఫిర్యాదుదాలరకు కళ్లకు కట్టినట్టు చూపించి చాలావరకు సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు.
ఓఆర్ ఆర్ వరకూ హైడ్రా పరిధి విస్తరించి ఉందని.. ఎన్ ఆర్ ఎస్ సీ లెక్కల ప్రకారం దాదాపు 61 శాతం చెరువులు మాయం అయ్యాయని.. మరో 15 సంవత్సరాలలో మిగతా చెరువులు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. ఇలాంటి తరుణంలో చెరువుల జాడ తెలుసుకుని వాటిని పరిరక్షించే పనిని ముమ్మరం చేశామని చెప్పారు. హైడ్రా చర్యలతో రియల్టర్లతో పాటు.. ఇతరులెవరూ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో లే ఔట్‌లు వేయడం, నిర్మాణాలు చేపట్టడం లేదని హైడ్రా కమిషనర్ చెప్పారు. ఎన్ ఆర్ ఎస్ సీ సేవలను మరింత విస్తృత స్థాయిలో వినియోగించుకోడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2006లో ఉన్న ఎన్ ఆర్ ఎస్ సీ అందించిన డెమ్ (డిజిటల్ మోడల్ ఎలివేషన్) డేటాతో చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌లను నిర్ధారించడం జరుగుతోందని.. అవసరమైతే 1970, 1990ల నాటి డేటాను కూడా తాము వినియోగించుకుంటామని చెప్పారు. ఓఆర్ ఆర్ పరిధిలో సుమారు 1350 ఎకరాల ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన భూమిని కాపాడామని.. దీని విలువ దాదాపు ₹70,000 కోట్ల వరకూ ఉంటుందని చెప్పారు.
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌లోని చెరువుల నీటి నాణ్యతపై ఉపగ్రహ ఆధారిత అధ్యయనాలు నిర్వహించేందుకు NRSC సహకరించాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు కోరారు. ఈ అధ్యయనాలు కాలుష్య స్థాయిలను పర్యవేక్షించడంతో పాటు శాస్త్రీయ ఆధారాలతో సరస్సుల పునరుద్ధరణ చర్యలకు సహాయపడతాయన్నారు. పర్యావరణ పరిరక్షణలో జల సంరక్షణ కీలకమైనదని.. నీటి వనరులను కాపాడడంలో హైడ్రా చొరవ అభినందనీయమని ఇస్రో ఛైర్మెన్ డా. వి. నారాయణన్ అన్నారు. సదస్సులో వర్చ్యువల్ ద్వారా కీలకోపన్యాసం చేశారు. ఇస్రో సాంకేతిక పరిజ్ఞనాన్ని సామాన్యులకు చేరవేయడంలో హైడ్రా చొరవ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. అంతరిక్ష ఆధారిత సాంకేతికతను వినియోగించి ప్రజా ఆస్తులతో పాటు సరస్సులను రక్షించేందుకు హైడ్రా చేస్తున్న కృషిని ఇస్రో శాస్త్రవేత్తలు అభినందించారు. ఎన్ ఆర్ ఎస్ సీ డైరెక్టర్ డా. ప్రకాష్ చౌహాన్, ఇస్రో మాజీ ఛైర్మెన్ శ్రీ ఏఎస్ కిరణ్ కుమార్‌తో పాటు పలువురు మాట్లాడారు. చెరువులు, పార్కులు కాపాడడంలో హైడ్రాకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఎన్ ఆర్ ఎస్ సీ సెంటర్లో శుక్రవారం జరిగిన సదస్సులో పలువురు శాస్త్రవేత్తల సమక్షంలో “హైడ్రా-రక్ష” పౌర కేంద్రిత పోర్టల్ ప్రారంభమైంది. ఓ ఆర్ ఆర్ పరిధిలోని చెరువులు, నాలాల హద్దులతో పాటు.. భూముల వివరాలు తెలుసుకునేందుకు హైడ్రా - రక్ష పోర్టల్ ఉపయోగపడుతుంది. “హైడ్రా-రక్ష” పోర్టల్‌ను మొదట్లో కొన్ని వారాల వరకూ HYDRAA అంతర్గత వినియోగానికి మాత్రమే వినియోగిస్తుంది. పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చిన తర్వాత ఈ పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుంది.