|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 03:10 PM
మన జీవనశైలిలో అనేక మార్పులు టెక్నాలజీ ద్వారా చోటుచేసుకుంటున్నాయి.ఇందులో భాగంగా డాక్యుమెంట్లు ప్రింట్ తీసుకునే విధానంలోనూ ఓ కొత్త ఆవిష్కరణ హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చింది. జిరాక్స్ దుకాణాల దగ్గరకి వెళ్లాల్సిన అవసరం లేకుండా, మనిషితో సంబంధం లేకుండా నేరుగా ప్రింట్ తీసుకునే అత్యాధునిక కియోస్క్ నగరంలో ఏర్పాటైంది. వివరాల్లోకి వెళ్ళితే... హైదరాబాద్, కూకట్‌పల్లి మెట్రో స్టేషన్‌లో ‘వికీ ప్రింట్’ పేరుతో ఈ సెల్ఫ్ సర్వీస్ ప్రింటింగ్ కియోస్క్‌ను ఏర్పాటు చేశారు.ఈ కియోస్క్ ద్వారా ప్రింట్ తీసుకోవడం చాలా సులభం. ముందుగా కియోస్క్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేయాలి. వెంటనే ఫోన్‌లో ఫైల్ అప్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. వినియోగదారులు తమ ఫోన్‌లో సేవ్ చేసుకున్న డాక్యుమెంట్, సర్టిఫికేట్ లేదా ఏదైనా ఫైల్‌ను అప్‌లోడ్ చేయవచ్చు.ఫైల్ అప్‌లోడ్ చేసిన తర్వాత, ప్రింట్ బ్లాక్ అండ్ వైట్‌లో కావాలా? లేక కలర్‌లో కావాలా?, అలాగే ఎన్ని కాపీలు కావాలో ఎంచుకోవాలి. ఎంపిక చేసుకున్న ఆప్షన్ల ఆధారంగా చెల్లించాల్సిన మొత్తాన్ని స్క్రీన్‌పై చూపిస్తుంది. ఆ తర్వాత యూపీఐ (UPI) ద్వారా సులభంగా చెల్లింపు పూర్తి చేయవచ్చు. పేమెంట్ పూర్తయ్యాక, వినియోగదారుడి మొబైల్ నంబర్‌ను నమోదు చేయమని అడుగుతుంది. నంబర్ ఎంటర్ చేయగానే ఫోన్‌కు ఒక ఓటీపీ (OTP) వస్తుంది. ఆ ఓటీపీని కియోస్క్‌పై ఉన్న కీప్యాడ్‌లో ఎంటర్ చేసిన వెంటనే, కోరుకున్న ప్రింటౌట్లు బయటకు వస్తాయి.