|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 11:49 AM
రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.147 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. హైదరాబాద్ కు చెందిన తనికెళ్ళ ఇంటిగ్రేటెడ్ కన్సల్టెన్సీ సభ్యులు ఆలయ ప్రాంగణం, పరిసరాలను పరిశీలించి, భక్తుల కోసం కాటేజీలు, క్యూలైన్లు, ఒడి బియ్యం కౌంటర్, బోనాల మంటపం, అద్దాల మేడ వంటి నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు నిర్మాణం కోసం రూ.35 కోట్లు మంజూరు చేశారు.పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయలకు ఏడాది పొడువునా తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్నాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. మహాశివ రాత్రికి మూడు రోజులు పాటు వైభవంగా జరిగే జాతరను రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్గా నిర్వహి స్తోంది. జాతరకు దాదాపు పది లక్షల మంది భక్తులు వస్తారు. దసరా సందర్భంగా తొమ్మిది రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం 20 నుంచి 30 వేల మంది వరకు వస్తారు.