|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 06:32 PM
హైదరాబాద్ లో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు హైదరాబాద్ నగరంలోని ఐటీ నిపుణులు, విద్యార్థుల కడుపు కొడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో గచ్చిబౌలి ఐటీ కారిడార్ కేంద్రంగా పనిచేస్తున్న 'ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్' కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ వాడకాన్ని తగ్గించేందుకు మెనూలో భారీ మార్పులు చేస్తూ హాస్టల్ యజమానులకు అత్యవసర మార్గదర్శకాలను విడుదల చేసింది. సిలిండర్ల కొరత తీరేవరకు పొదుపుగా వంట చేయాలని అసోసియేషన్ సూచించింది.
అందులో భాగంగా ఎక్కువ సమయం, అధిక ఆయిల్ వినియోగించే చపాతీ, పూరీ, దోశ వంటి టిఫిన్లను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించింది. ఉదయం, సాయంత్రం అందించే టీ, కాఫీలను కూడా ప్రస్తుతానికి సర్వ్ చేయటం కుదరదన్నారు. కేవలం అన్నం, పప్పు వంటి భోజనం మాత్రమే అందుబాటులో ఉంటుందని.. గ్యాస్ కొరత తీవ్రతను బట్టి కొన్ని రకాల కూరలు, స్పెషల్ ఐటమ్స్‌ను కూడా బంద్ చేయనున్నట్లు వెల్లడించారు. హాస్టళ్లలో విద్యార్థులు, ఉద్యోగులు సొంతంగా వంట చేసుకోవడానికి వీల్లేదని, అటువంటి సదుపాయాలను తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు ప్రకటించారు.
గ్యాస్ కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ వంట పద్ధతులను ఇండక్షన్ లేదా ఇతర మార్గాలను అనుసరించాలని అసోసియేషన్ హాస్టల్ యజమానులను కోరింది. ప్రస్తుత పరిస్థితిని గమనించి హాస్టళ్లలో ఉంటున్న వారు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ నిర్ణయంపై హాస్టళ్లలో ఉండే వేలాది మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన మెస్ ఛార్జీలతో ఇబ్బంది పడుతుంటే.. ఇప్పుడు కనీసం నచ్చిన ఆహారం కూడా దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారు.
కాగా, గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఇబ్బందులు తప్పేలా కనిపించటం లేదు. మెట్రో నగరాలైన బెంగళూరు, ముంబైలలో ఇప్పటికే హోటళ్లను మూసేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో వండిపెట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది. హైదరాబాద్ నగరంలోనూ చాలా హోటళ్లు మెనూ తగ్గించాయి. పూరీ, వడ, దోశ వంటి వంటకాలను నిలిపివేశారు. తక్కువ గ్యాస్ వినియోగం అయ్యే ఆహారపదార్థాలు మాత్రమే అందుబాటులో ఉంచున్నారు