|
|
by Suryaa Desk | Sat, Apr 18, 2026, 10:50 AM
బీఆర్ఎస్ పార్టీతో సహా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సానుకూలంగా ఉన్నా… బీజేపీ రాజకీయంతోనే బిల్లు వీగింది. ఇప్పటికైనా వెంటనే డీలిమిటేషన్ అంశంతో సంబంధం లేకుండా మహిళలకు రిజర్వేషన్లు వచ్చేలా కొత్త బిల్లు తీసుకువచ్చి బీజేపీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.బీజేపీ పన్నిన కుటిల రాజకీయాల వల్లే దేశంలోని మహిళా లోకానికి దక్కాల్సిన రిజర్వేషన్లు వెంటనే దక్కకుండా పోయాయని మండిపడ్డారు.బీఆర్ఎస్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు పలికినప్పటికీ, డీలిమిటేషన్ పేరుతో కావాలనే చిక్కుముళ్లు తెచ్చిపెట్టి బిల్లు విఫలమయ్యేలా చేసింది బీజేపీ అని ధ్వజమెత్తారు.మహిళా సాధికారతపై బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని నేటి పరిణామాలతో తేలిపోయిందని ఎద్దేవా చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును అనవసరంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంతో ముడిపెట్టడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు.
"ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లతోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేసి ఉంటే ఎటువంటి సమస్య వచ్చేది కాదు. కానీ మహిళల రిజర్వేషన్ల అంశాన్ని ముడిపెట్టి దేశ మహిళల భుజాల మీద నుంచి దక్షిణాది రాష్ట్రాల గొంతు కోయాలని బీజేపీ చూసింది" అని ఆరోపించారు.దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను, డీలిమిటేషన్ పర్యవసానాలను పట్టించుకోకుండా మొండిగా ముందుకు పోవడంతో ఒక చారిత్రక అవకాశం జారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా రిజర్వేషన్ల పేరుతో బీజేపీ ఆడిన నాటకాన్ని దేశ ప్రజలు కళ్లారా చూశారని కేటీఆర్ అన్నారు. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం మహిళలను వాడుకుని, ఇప్పుడు వారిని వెన్నుపోటు పొడిచిన పార్టీగా బీజేపీ చరిత్రలో నిలిచిపోతుందని హెచ్చరించారు.ఇప్పటికైనా బీజేపీ తన నిజాయితీని నిరూపించుకోవాలంటే, డీలిమిటేషన్ నిబంధన లేకుండా కేవలం మహిళా రిజర్వేషన్ల కోసమే ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టి, రానున్న ఎన్నికల నుంచే దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.దేశంలోని అనేక పార్టీలు డీలిమిటేషన్ అనే అంశం అత్యంత సంక్లిష్టమైనదని… ప్రస్తుత విధానంలో దక్షిణ భారతదేశానికి పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గడం ప్రమాదకరమని స్పష్టంగా చెప్పిన విషయాన్ని బీజేపీ గుర్తించాలన్నారు.ఇప్పటికైనా దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని డీలిమిటేషన్ అంశం పైన విస్తృతమైన చర్చ, సంప్రదింపులు చేపట్టాలన్నారు.
డీలిమిటేషన్ అంశం పైన మొండిగా ముందుకు పోవడం కుదరదనే విషయం ఈరోజు లోక్ సభలో జరిగిన పరిణామాలను బట్టి బీజేపీ గుణపాఠం నేర్చుకోవాలని కేటీఆర్ అన్నారు.
దీంతోపాటు తెలంగాణ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల పెంపు అనేది మా హక్కు అని కేటీఆర్ గుర్తుచేశారు.జమ్మూ కాశ్మీర్, అస్సాం రాష్ట్రాల్లో దేశవ్యాప్త డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా సీట్ల పెంపు చేపట్టిన కేంద్రం, తెలంగాణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు.మహిళా బిల్లుతో, దేశవ్యాప్త డీలిమిటేషన్ అంశం సంబంధం లేకుండా, తెలంగాణ అసెంబ్లీ సీట్లను 2028 లోపు పెంచేలా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రత్యేక బిల్లు తీసుకురావాలని గట్టిగా డిమాండ్ చేశారు.