|
|
by Suryaa Desk | Wed, Apr 22, 2026, 11:57 AM
అనేక దేవాలయాలకు కొలువై ఉన్న జగద్గిరిగుట్ట ఉన్న కోనేరు(గుండం) కబ్జాకు గురౌతోందని.. కాపాడాలని అక్కడి గోవిందరాజుల స్వామి ఆలయ పూజారి నరహరి రోధిస్తూ వేడుకున్న వీడియో అందరికీ గుర్తే ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వీడియోను చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ కోనేరు పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన విషయమూ విధితమే. ఈ మేరకు మంగళవారం కోనేరు ఆక్రమణలను హైడ్రా తొలగించింది. అందులో పేరకుపోయిన పూడికను తరలించింది. దాదాపు 26 ట్రక్కుల వరకూ ఉన్న నిర్మాణ వ్యర్థాలు, చెత్త, చెదారాన్ని తొలగించి కోనేరుకు కొత్త కళను అందించింది. ఒక ఎకరా వరకూ ఉన్న కోనేరును ఆక్రమించి మట్టితో నింపి.. పార్కింగ్ కోసం అక్కడి వారు వినియోగించుకుంటున్నారు. ఇలా మొత్తం కోనేరునే కబ్జా చేయాలనుకునే ప్రయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. ఆ కోనేరు పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. దీంతో స్థానికులతో పాటు.. ఆలయ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. కబ్జాలను నియంత్రిచడంలో హైడ్రా చొరవను అభినందించారు.
22 ఏళ్ల పోరాటం ఫలించిందని గోవిందరాజుల స్వామి ఆలయ పూజారి నరహరి అన్నారు. కోనేరును చూడకుండానే జీవితం అంతమౌతుందేమో అని ఆందోళన చెందాను.. ఇప్పుడు హైడ్రా రూపంలో ఆ భగవంతుడే.. కోనేరు పరిరక్షణకు చర్యలు తీసుకున్నారు. హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి.. కబ్జాలను తొలగించిన హైడ్రా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, హనుమాన్ దేవాలయం, జగద్గిరిగుట్ట గోవిందరాజుల స్వామి ఆలయం, పోచమ్మ టెంపుల్, శ్రీ వాసవి కనకపరమేశ్వరి ఆలయం, శ్రీ నల్ల పోచమ్మ ఆలయం, శివాలయం, పరశురామాలయం, అయ్యప్పస్వామి ఆలయం ఇలా దేవదేవతలు కొలువైన జగద్గిరి గుట్ట నగర ప్రజలందరికీ సుపరిచితమే. ఇలాంటి చరిత్ర ఉన్న ఆలయ భూములను, కోనేరును కాపాడం ఎంతో శుభ పరిణామం అని అన్నారు. వర్షాలు పడినప్పుడు గుట్టపైనుంచి వచ్చే నీరు అందులో చేరుతుందని.. బోర్లు వేసి అయినా నీటితో కోనేరును నింపుతామని పూజారి నరహరి చెప్పారు.