![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 08:39 PM
హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకెళ్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే గజం ధర 2 లక్షలకు పైగానే పలుకుతోంది. ఇటీవల కూకట్‌పల్లిలో హౌసింగ్ బోర్డు స్థలాలు వేలం వేయగా.. రికార్డు స్థాయిలో గజం రూ.2.98 లక్షలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా గచ్చిబౌలిలోనూ గజం ధర రికార్డు స్థాయికి అమ్ముడయింది. గచ్చిబౌలిలోని హౌసింగ్ బోర్డు స్థలాలను సోమవారం (జూన్ 23) విక్రయానికి పెట్టారు. వేలంలో ఓ కమర్షియల్ స్థలం గజం భూమి రూ.2.22 లక్షలు పలికి రికార్డు సృష్టించింది. ఈ వేలంలో మొత్తం 53 మంది పోటీదారులు పాల్గొన్నారు.
గచ్చిబౌలిలో వేలం వేసిన 4 స్థలాలూ అమ్ముడుపోయాయి. ముఖ్యంగా కుక్కలపార్కును ఆనుకుని ఉన్న 1,487 చదరపు గజాల స్థలం భారీ ధరకు అమ్ముడుపోయింది. దీనికి మొదట గజానికి రూ.1.20 లక్షలు కనీస ధరగా నిర్ణయించగా.. వేలంలో ఏకంగా గజం రూ.2.22 లక్షల చొప్పున మొత్తం రూ.33 కోట్ల ధర దక్కించుకుంది. ఇది హైదరాబాద్‌లో వాణిజ్య భూముల డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది.
గచ్చిబౌలితో పాటు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, చింతల్‌లో ఎంజీఐకి చెందిన 10 స్థలాలను వేలం వేయగా వాటిలో 3 అమ్ముడుపోయాయి. వీటి ద్వారా సుమారు రూ.8.11 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. బాచుపల్లిలో 8 ప్లాట్లను వేలం వేయగా 4 అమ్ముడుపోయాయి. ఇక్కడ బీ-1 బ్లాక్‌లోని ఎఫ్17 ప్లాటు అత్యధికంగా రూ.18.21 లక్షల ధర పలికింది. ఈ వేలం ప్రక్రియ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి మొత్తం రూ.65 కోట్ల ఆదాయం సమకూరినట్లు హౌసింగ్ బోర్డు కమిషనర్ గౌతమ్ తెలిపారు. ఇందులో గచ్చిబౌలిలోని భూముల ద్వారానే అత్యధికంగా రూ.55.56 కోట్లు రావడం గమనార్హం.
కూకట్‌పల్లిలో హౌసింగ్‌బోర్డు స్థలాలను 10 రోజుల క్రితం వేలం వేశారు. పశ్చిమ డివిజన్ హౌసింగ్‌బోర్డు అధికారులు నిర్వహించిన ఈ వేలంలో ఏకంగా రూ.141.36 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. కేపీహెచ్‌బీ- హైటెక్ సిటీ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాలకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఏడో ఫేజ్‌లోని నాలుగు వరుస స్థలాలకు గజానికి రూ.2 లక్షలకు పైగా ధర పలికింది. ఎంఐజీ ప్లాట్‌కు అత్యధికంగా గజానికి రూ.2.98 లక్షలు పలికాయి. ఈ సరికొత్త ధరలు హైదరాబాద్‌లోని స్థిరాస్తి మార్కెట్ బలంగా ఉందని, ముఖ్యంగా గచ్చిబౌలి వంటి ఐటీ, వాణిజ్య కేంద్రాలకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు అధిక డిమాండ్ ఉందని స్పష్టం చేస్తున్నాయి. ఇది ప్రభుత్వ ఆదాయానికి కూడా గణనీయంగా దోహదపడింది.