![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 08:19 PM
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నా కొందరు ఉద్యోగుల తీరు మారడం లేదు. తాజాగా నల్గొండ జిల్లాలో ఓ అవినీతి డిప్యూటీ తహసీల్దార్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. సీజ్ చేసిన వాహనాలను విడుదల చేసేందుకు రూ.70,000 లంచం డిమాండ్ చేసిన కేసులో జిల్లా పౌర సరఫరాల శాఖకు చెందిన డిప్యూటీ తహశీల్దార్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ డివిజన్ పౌర సరఫరాల శాఖలో డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్న షేక్ జావీద్, అధికారులు స్వాధీనం చేసుకున్న మూడు వాహనాల విడుదలకు ఓ వ్యక్తిని లంచం డిమాండ్ చేశాడు. వాహనాలకు పంచనామా నిర్వహించి, కోర్టు నుంచి విడుదల ఉత్తర్వులు ఇప్పించేందుకు గాను తొలుత రూ.1,00,000 కావాలని అడిగాడు. ఆ తర్వాత బేరసారాలతో రూ.70,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది.అయితే, లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు ఆధారంగా జూన్ 7న కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు, విచారణ జరిపి డిప్యూటీ తహశీల్దార్ షేక్ జావీద్‌ను అరెస్ట్ చేశారు.