|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 09:22 PM

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై సమగ్రంగా ఆరా తీశారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన, పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయి రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు.. అంతర్గత విషయాలపై వాకబు చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న పలువురు సీనియర్ నాయకులు ఖర్గేను కలిసి తమ ఆకాంక్షలను వ్యక్తం చేశారు. అయితే.. పదవుల విషయంలో పార్టీ అధిష్టానం వైఖరిని ఖర్గే తేల్చి చెప్పినట్లు సమాచారం.
మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, సుదర్శన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, బాలూ నాయక్ వంటివారు ఖర్గేతో ముఖాముఖి భేటీ అయ్యారు. పార్టీ కోసం తమ నిబద్ధతను, చేసిన సేవలను వివరించడంతో పాటు.. తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరారు. ముఖ్యంగా.. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు ఇంద్రవెల్లి సభ సందర్భంగా మంత్రి పదవికి హామీ ఇచ్చారని ప్రేమ్‌సాగర్‌రావు ఖర్గే దృష్టికి తెచ్చినట్లు సమాచారం.
కొందరు నేతలు.. ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించారని, సీనియర్లకు అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు కలిపి ఒక్క మంత్రి పదవి కూడా లేకపోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతుందని, పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలం పుంజుకుంటోందని ఖర్గేకు వివరించారు. బంజారాలకు మంత్రివర్గంలో అన్యాయం జరిగిందని బాలూ నాయక్ ఫిర్యాదు చేయగా.. తాను మంత్రి పదవికి అర్హుడిని అంటూ వివరిస్తూ రామ్మోహన్‌రెడ్డి ఒక నివేదికను సమర్పించారు.
అందరి అభిప్రాయాలను సావధానంగా విన్న ఖర్గే.. ప్రస్తుత కేబినెట్‌లోని సామాజిక కూర్పు గురించి ముఖ్య నేతలతో ఆరా తీశారు. అయితే.. ఏ ఒక్క నాయకుడికీ ప్రత్యేకంగా హామీ ఇవ్వలేదు. బీఆర్ఎస్, బీజేపీ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాల గురించి ఆయన తెలుసుకున్నట్లు సమాచారం.
ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గ నేతలు మంత్రి పదవి కోసం ఖర్గేను కలిసిన నేపథ్యంలో.. కేబినెట్‌లో ఆ వర్గానికి ఇప్పుడున్న పదవుల సంఖ్య గురించి చర్చ జరిగింది. ప్రస్తుతం మంత్రివర్గంలో కేవలం మరో మూడు ఖాళీలు మాత్రమే ఉన్నందున, రెడ్డి సామాజిక వర్గానికి అదనపు అవకాశం ఇవ్వటం సాధ్యపడదనే అభిప్రాయం వ్యక్తమైనట్లు పార్టీ వర్గాల సమాచారం. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి సైతం ప్రత్యేకంగా ఖర్గేను కలిశారు.