![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 05:35 PM
కాలుకు సర్జరీ చేయించుకున్న ఏడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. సర్జరీ చేసిన తర్వాత గుండెపోటుతో చిన్నారి మరణించాడని వైద్యులు చెప్పడంపై తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మరణించాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఏడేళ్ల బాలుడు కాలుకు దెబ్బ తగలడంతో చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు కాలుకు చీము పట్టిందని.. వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు. అయితే సర్జరీ చేసిన కాసేపటికే బాలుడి పరిస్థితి విషమించి మృతి చెందాడు. గుండెపోటుతో చిన్నారి మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో ఆగ్రహించిన బాలుడి తల్లిదండ్రులు, బంధువులు వైద్యుల చెప్పిన విషయాన్ని అంగీకరించడానికి నిరాకరించారు. కాలుకు చిన్నపాటి దెబ్బ తగిలితే గుండెపోటు ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణం తీసిందని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత బాలుడి మృతికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ సంఘటన నగరంలో వైద్య నిర్లక్ష్యంపై మరోసారి చర్చకు దారితీసింది.
చిన్న వయసులోనే చిన్నారులు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ ఆరేళ్ల చిన్నారి మిధున గుండెపోటుతో కన్నుమూసింది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన గోవింద్ అశోక్, అనూష దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉపాధి కోసం వీరు హైదరాబాద్‌కు వలస వచ్చారు. అశోక్ నగరంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం రాత్రి మిధున (6) ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది. కొద్దిసేపటికే అపస్మారక స్థితికి చేరుకోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా చిన్నారిని దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు చికిత్స చేస్తుండగానే మిధున మృతి చెందింది. గుండెపోటుతోనే తమ కుమార్తె మరణించినట్లు వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు వెల్లడించారు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్న వయసులోనే గుండెపోటుతో చిన్నారులు మరణించడంపై వైద్య నిపుణులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.