|
|
by Suryaa Desk | Sun, Jul 06, 2025, 01:03 PM

శ్రీశైలం జలాశయంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అటు జూరాల, ఇటు సుంకేసుల నీరు రావడంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. ఆదివారం ఉదయం నాటికి శ్రీశైలం జలాశయానికి 1.70 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంది. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,084 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878.40 అడుగుల వరకు నీరు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు కాగా, ప్రస్తుతం ఇప్పుడు 179.8995 టీఎంసీల నీరు ఉంది. అయితే శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో మరో రెండు, మూడు రోజుల్లో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే శ్రీశైలం జలాశయం మొత్తం 12 గేట్లలో మూడు గేట్ల నుంచి వాటర్ లీకేజీ కావడం ఆందోళన కలిగిస్తుంది. శనివారం రోజున ఐదో నంబర్, ఆరో నంబర్ గేట్ల వద్ద చిన్నపాటి లీకేజ్‌ను అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అయతే 10వ నంబర్ గేటు వద్ద నుంచి భారీ లీకేజ్ సంభవించింది. అయితే శ్రీశైలం జలాశయంను పర్యవేక్షిస్తున్న అధికారులు మాత్రం దీనిని ధ్రువీకరించడం లేదు. ఇక, శ్రీశైలం జలాశయం భద్రతపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏడాది కిందటే హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. 2009లో వరదల వల్ల ఒక్క రోజులోనే 25 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో ప్లంజ్‌పూల్ ప్రాంతంలో గోతులు ఏర్పడ్డాయి. అలాగే వరదలకు శ్రీశైలం డ్యాం కుడివైపు కొండచరియలు, అప్రోచ్‌రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయాయి. శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదపు అంచున ఉందని... జలాశయం కింద భూగర్భంలోని రాతిఫలకాల మధ్య బలహీన అతుకులున్నాయని, అనుబంధ జాయింట్ల మధ్య దూరం పెరిగితే డ్యామ్ పునాదులు రక్షణను కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా వేసింది. మరోవైపు గత కొన్ని నెలలుగా సాధారణ నిర్వహణలో భాగంగా లీకేజీలను మూసివేయడానికి శ్రీశైలం డ్యామ్ గేట్లకు మరమ్మతులు చేరపట్టారు. మరమ్మతులు నిర్వహించినప్పటికీ ఇలా గేట్ల నుంచి నీరు లీక్ కావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది.