|
|
by Suryaa Desk | Sat, Jul 05, 2025, 10:32 AM

చెత్తతో నాలాలు పూడుకుపోయాయి. కల్వర్టులు జామయ్యాయి. ఏ కల్వర్టును కదిపినా టన్నుల కొద్ది చెత్త బయటపడుతోంది. కొన్ని చోట్ల నాలా ఆనవాళ్లే లేని పరిస్థితి. మ్యాన్‌హోళ్ల మూతలు తీస్తే.. ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో వర్షం నీరు వెళ్లే పరిస్థితి కనిపించడంలేదు. అందుకే
హైడ్రా మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్(ఎంఈటీ)లు 150, హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు 51 కలసి నాలాలు, కల్వర్టుల వద్ద పూడిక తీత పనులకు ప్రాధాన్యతనిచ్చాయి. వర్షం లేని ఖాళీ సమయాన్ని హైడ్రా సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుంటోంది. నాలాల్లో పూడిక తీసే పనులను చేపట్టింది. ఈ క్రమంలో పూడిక తీస్తుంటే కొన్ని చోట్ల టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త బయట పడుతోంది. యూసుఫ్‌గూడ పరసరాల్లోని మధురానగర్వ, కృష్ణానగర్ వద్ద వరద కాలువలో పేరుకుపోయిన చెత్తను హైడ్రా బృందాలు తొలగించాయి. గచ్చిబౌలిలోని జనార్దన్‌రెడ్డి నగర్‌లోని నాలాల్లో పేరుకుపోయిన చెత్తను హైడ్రా తొలగించింది. కాప్రా సర్కిల్ వార్డు నెం.2 మార్కండేయ కాలనీలో నాలా క్యాచ్‌పిట్ ఏరియాలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ఎల్‌బీనగర్ సర్కిల్ పరిధిలో ఆర్‌సీఐ రోడ్డు, మితిలానగర్ దగ్గర మంత్రాల చెరువు నుంచి జిల్లెలగూడ చెరువు కు వెళ్లే నాలా లో ఉన్న పూడికను హైడ్రా డీఆర్ ఎఫ్,ఎంఈటీ బృందాలు జేసీబీ ద్వారా తొలగించాయి.
వర్షాలు లేని సమయంలో ఖాళీగా ఉండకుండా హైడ్రా ఆ సమయాన్ని వరద నివారణకు చేపట్టే చర్యలపై దృష్టి పెడుతోంది. పరిధులు గీసుకొని ఉండకుండా 150 హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, 51 హైడ్రా డీ ఆర్ ఎఫ్ బృందాలు నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించే పనుల్లో నిమగ్నం అవుతున్నాయి. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ పరిధిలోని 940 కల్వర్టుల వద్ద పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను తొలగిస్తున్నాయి. మ్యాన్‌హోల్స్/ క్యాచ్ పిట్‌ల వద్ద చెత్త/సిల్ట్ ను తొలగించి వరద ప్రవాహానికి ఆటంకం లేకుండా చేస్తున్నాయి. సిల్ట్/చెత్త తొలగింపులో జీహెచ్ఎంసీకి హైడ్రా మద్దతు ఇస్తోంది. ప్రధానంగా క్యాచ్‌పిట్‌లు, కల్వర్టులు, ఇతర తీవ్రమైన సమస్యాత్మక ప్రాంతాలపై హైడ్రా దృష్టి పెడుతుంది. ఈ పాయింట్ల వద్ద చెత్త/సిల్ట్ తొలగించడం వల్ల నీటి ప్రవాహాన్ని బాగా మెరుగుపరుస్తోంది. అదనంగా, నాలాలపై ఆక్రమణలను తొలగించడానికి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్లు, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ బృందాలతో కలిసి హైడ్రా పనిచేస్తోంది. ఇవన్నీ నీటి నిల్వ/ముంపు/ముంపు సమస్యలను చాలా వరకు తగ్గిస్తాయి.